ముఖ్యమంత్రిని చేస్తాం.. పార్టీలోకి వచ్చేయ్ అన్నారు: సోనూసుద్

మా పార్టీలో చేరు.. నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాం.. సీఎం కాకపోతే డిప్యూటీ సీఎంను చేస్తాం.. అదీ వద్దంటే చెప్పు.. మా పార్టీ తరపున రాజ్యసభకు పంపిస్తాం.. నటుడు సోనూసూద్‌కు వచ్చిన ఆఫర్లు ఇవి.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కాకపోతే ఏ రాజకీయ పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది అనేది మాత్రం వెల్లడించలేదు. 

సీఎం, డిప్యూటీ సీఎం, ఎంపీ పదవులకు వచ్చిన ఆఫర్స్ అన్నింటినీ తిరస్కరించినట్లు సోనూసూద్ స్పష్టం చేశారు. ఈ ఆఫర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తుంది. దీనికి కారణం లేకపోలేదు.. ఎందుకంటే.. సోనూసూద్ సోదరి మాళవిక 2022లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.. కాంగ్రెస్ పార్టీ తరపున పంజాబ్ రాష్ట్రం నుంచి బరిలోకి దిగారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థి అమన్‌దీప్ కౌర్ అరోరా చేతిలో ఓడిపోయారు.

ఉదారత చాటుకున్న ఒకే ఒక్కడు

కోవిడ్ -19 మహమ్మారి సమయంలో వలస కార్మికులకు సహాయం చేయడం ద్వారా సోనూ సూద్‌ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎక్కడ, ఎవరు కష్టకాలంలో ఉన్నా.. తానున్నానంటూ భరోసా నింపాడు. ఆక్సీజన్ సిలిండర్లు దొరక్క అవస్థలు పడుతున్న వారికి అండగా నిలిచాడు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారికి తన వంతు సహాయం చేశాడు. వీటి వల్ల అతనికున్న జనాదరణను రాజకీయ పార్టీలు క్యాష్ చేసుకోవాలని చూడగా.. సోనూసూద్ వాటన్నటినీ సున్నితంగా తిరస్కరించారు.