ఏపీలో విచిత్ర పోరు: ఎన్నికల బరిలో ఆరుమంది మాజీ సీఎంల కొడుకులు

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. బహుశా ఇలాంటి పరిణామం ఏ ఇతర రాష్ట్రంలో జరిగి ఉండదని చెప్పచ్చు. మాజీ సీఎంల వారసులు ఎన్నికల్లో పోటీ చేయటం మాములే కానీ, ఏపీ ఎన్నికల్లో ఏకంగా ఆరు మంది మాజీ సీఎంల కొడుకులు పోటీకి దిగుతున్నారు. ఆ ఆరు మంది మాజీ సీఎంల వారసులు ఎవరెవరో, ఎక్కడి నుండి బరిలో దిగుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

వైఎస్ జగన్:

మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల నుండి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నాడు. 2009లో కడప ఎంపీగా పోటీ చేసిన జగన్ వైఎస్ మరణానంతరం పులివెందుల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని వీడి వైఎసార్సీపిని స్థాపించిన నాటి నుండి జగన్ పులివెందులలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తూ వస్తున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో జగన్ తన విజయ పరంపరను కొనసాగిస్తాడా లేదా చూడాలి.

నారా లోకేష్:

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ మంగళగిరి నుండి ఎన్నికల బరిలో దిగుతున్నాడు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేసి ఓడిపోయిన లోకేష్, ఈ ఎన్నికల్లో కూడా అక్కడి నుండే పోటీ చేస్తున్నాడు. గత ఎన్నికల్లో లోకేష్ పై వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గెలుపొందగా ఈ ఎన్నికల్లో లోకేష్ పై లావణ్య పోటీ చేస్తున్నారు. మరి, లోకేష్ సహా టీడీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంగళగిరి నుండి లోకేష్ విజయం సాధిస్తాడా లేదా వేచి చూడాలి.

నందమూరి బాలకృష్ణ:

టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం నందమూరి తారక రామారావు ( NTR ) కొడుకు నందమూరి బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. 2014, 2019 ఎన్నికల్లో హిందూపూర్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలకృష్ణ ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

నాదెండ్ల మనోహర్:

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కొడుకు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా తెనాలి నుండి పోటీ చేస్తున్నాడు. గతంలో ఎమ్మెల్యేగా స్పీఎకర్ గా పని చేసిన అనుభవం ఉన్న మనోహర్ ఈ ఎన్నికల్లో తెనాలి నుండి విజయం సాధిస్తాడా లేదా చూడాలి.

నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి:

మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకు రామ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున వేంకటగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు.

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి:

మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకు సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ తరఫున డోన్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. మరి, మునుపెన్నడూ లేని విధంగా జరుగుతున్న ఈ ఆసక్తికర పోరులో ఎవరెవరు గెలుపొందుతారో వేచి చూడాలి.