కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ ఎదుట హాజరవుతారా ? అనే చర్చ జరుగుతోంది. ఆమెకు కరోనా సోకడంతో హోం ఐసొలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ‘నేషనల్ హెరాల్డ్’ మనీలాండరింగ్ కేసులో జూన్ 08వ తేదీన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఆమెతో పాటు రాహుల్ గాంధీకి కూడా సమన్లు జారీ అయ్యాయి. సమన్లు పంపిన ఒక రోజు తర్వాత..ఆమె కరోనా బారిన పడడంతో విచారణకు హాజరయ్యే అవకాశాలు తక్కువ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు.. తాను విదేశీ పర్యటనలో ఉన్నట్లు.. విచారణ తేదీని మార్చాలని రాహుల్ తరపు న్యాయవాది ఈడీని కోరారు. దీంతో జూన్ 13న విచారణకు హాజరు కావాలని కొత్తగా ఈడీ సమన్లు జారీ చేసింది. సోనియా, రాహుల్ కు సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. దేశంలో జీడీపీ, ఇతర ఘటనల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మను సింఘ్వీ ఆరోపించారు. మరోవైపు.. సోనియా గాంధీ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రధాన మంత్రి మోడీ ఆకాంక్షించారు.
ఏంటీ ఈ నేషనల్ హెరాల్డ్ కేసు?
1938లో కాంగ్రెస్ లోని కొంతమందితో కలిసి జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ ను ప్రారంభించారు. దీనిని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ పబ్లిష్ చేసేది. కాలక్రమేణా ఈ పేపర్ కాంగ్రెస్ పత్రికగా ముద్ర వేసుకుంది. స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ అధికార న్యూస్ పేపర్ గా చలామణి అయింది. అయితే తీవ్ర నష్టాల కారణంగా 2008లో ఈ పేపర్ ను మూసివేశారు. పబ్లిక్ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)ను యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఈఎల్) అనే ప్రైవేట్ సంస్థకు అప్పనంగా కట్టబెట్టారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. ఏజేఎల్ కు చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రికను కూడా వైఈఎల్ సొంతం చేసుకుందని... ఈ క్రమంలోనే దాదాపు రూ.2వేల కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులను రాహుల్ గాంధీ డైరెక్టర్ గా ఉన్న వైఈఎల్ సంస్థ అక్రమంగా పొందిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్రపన్నారని సుబ్రహ్మణ్యస్వామి తన ఫిర్యాదులో ఆరోపించారు. కేవలం రూ.50 లక్షల చెల్లించి ఆ హక్కును పొందేందుకు ప్రయత్నించారని అన్నారు. ఈ కేసు విషయమై 2014లో ఈడీ విచారణ చేపట్టింది.
