11 గంటల పాటు విచారణ..వందకు పైగా ప్రశ్నలు

11 గంటల పాటు విచారణ..వందకు పైగా ప్రశ్నలు
  • కొత్త సమన్లు జారీచేయని ఈడీ

న్యూఢిల్లీ: నేషనల్​ హెరాల్డ్​ న్యూస్​ పేపర్​కు సంబంధించి మనీ లాండరింగ్​ కేసులో కాంగ్రెస్  చీఫ్​ సోనియా గాంధీని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) అధికారులు బుధవారం 3 గంటలకుపైగా విచారించారు. కూతురు ప్రియాంకా వాద్రా, కొడుకు రాహుల్​ గాంధీతో కలిసి ఉదయం 11 గంటలకు సెంట్రల్​ ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు సోనియా చేరుకున్నారు. ఐదుగురు అధికారుల బృందం 11.15 గంటలకు ఆమెను ఎంక్వయిరీ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత విచారణకు హాజరు కావాలని ఈడీ ఆమెకు ఎలాంటి సమన్లు జారీచేయలేదు. దీంతో ఈ కేసులో సోనియా విచారణ పూర్తయినట్లేనని అధికారులు పరోక్షంగా తెలిపారు. ఈ కేసులో బుధవారం నాటి విచారణను కలుపుకొని ఆమెను 11 గంటలపాటు ప్రశ్నించారు. మొత్తం వంద ప్రశ్నలు అడిగారు. ఈ నెల 21న మొదటి రౌండ్​ ఎంక్వయిరీ ప్రారంభమైంది. సోనియా, రాహుల్​తదితర కాంగ్రెస్ ​నేతలు యంగ్​ ఇండియన్​ ప్రైవేట్ ​లిమిటెడ్​(వైఐపీఎల్) లో బోర్డు మెంబర్లు, డైరెక్టర్లుగా ఉన్నారు. నేషనల్ ​హెరాల్డ్ ​న్యూస్​ పేపర్​కు వైఐపీఎల్ ​ఓనర్​గా ఉంది. వైఐపీఎల్​లో మనీ లాండరింగ్​కు పాల్పడినట్లు సోనియా, రాహుల్ ​ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలపైనే ఇంతకుముందు రాహుల్​ను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. తాజా విచారణలో అసోసియేటెడ్ ​జర్నల్స్​ లిమిటెడ్‌‌‌‌​– యంగ్ ​ఇండియన్ ​డీల్​ద్వారా ఎలాంటి ఆస్తులు సంపాదించలేదని సోనియా చెప్పినట్లు సమాచారం. కొవిడ్ ​జాగ్రత్తలు తీసుకుంటూ ఈ విచారణ చేశారు. సోనియా వాంగ్మూలాన్ని ఆడియో వీడియో తీశామని అధికారులు తెలిపారు. ఆమెను ప్రశ్నిస్తున్నంతసేపు ఈడీ కార్యాలయం బయట కిలోమీటరు వరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ​ఆంక్షలు కూడా విధించారు. యంగ్​ ఇండియన్​ కంపెనీలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి 2013లో సోనియా, రాహుల్​పై కేసు వేశారు. యంగ్​ ఇండియన్​లో సోనియా, రాహుల్ ​ప్రమోటర్లుగా, మెజారిటీ షేర్​హోల్డర్లుగా ఉన్నారు. వారిద్దరికీ ఈ కంపెనీలో చెరో 38% వాటా ఉంది.