విజయవాడ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలపై స్పందించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కేసీఆర్ కుమారుడు కేటీఆరే ఇపుడు తెలంగాణ ప్రభుత్వం అనీ… జగన్ తో కలిసి కేటీఆర్ ఏపీపై కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన విమర్శించారు. 18నెలల్లో జైలుకెళ్లినా జగన్ మైండ్ సెట్ మారలేదనీ.. బుద్ది రాలేదని అన్నారు. టీడీపీ ఓట్లు తొలగించాలని టీఆర్ఎస్, వైసీపీ చేసే కుట్రలు బయటపడ్డాయని అన్నారు. జగన్ తన అవినీతి పత్రికలో మాత్రం లక్షల ఓట్లు గల్లంతు అయ్యాయని దుష్ప్రచారం చేస్తోందన్నారు.
“మా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, కార్యకర్తల వివరాల డేటా హైదరాబాద్ లో ఉంచుకుంటే అది నేరమా. కేటీఆర్, సజ్జనార్, రాజేంద్ర రెడ్డిలు బుర్ర ఉండి మాట్లాడుతున్నారా. రాకేష్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఫిర్యాదులు చేశామనడం కూడా రాజకీయ కుట్రే. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై నమ్మకం లేని జగన్ కు కేసీఆర్ పై నమ్మకం ఎందుకో ఇప్పుడు అందరికీ అర్దమైపోయింది. తెలంగాణలో చీకటి రాజ్యం నడుస్తోంది. నాడు జగన్, నేడు కేటీఆర్ సీఎం కుమారులుగా ఒకే విధంగా నియంతలా వ్యవహరిస్తున్నారు. ఇది ఎన్నికల కమిషన్ కు సంబంధించిన అంశమని హైకోర్టు మొట్టికాయలు వేసింది. అందుకే ఉద్యోగులను విడుదల చేశారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని, ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం మానుకోండి. చట్టానికి వ్యతిరేకం అయితే ఎపీ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. జయరాం హత్య హైదరాబాద్ లో జరిగితే మా పోలీసులు కేసు మీకు బదలాయించలేదా. రిటన్ గిప్ట్ ఇస్తామన్న కేసీఆర్, కేటీఆర్ లు ఇప్పుడు జగన్ తో లాలూచీ రాజకీయం చేస్తున్నారు. నిజాంల పాలన అనే భ్రమలో కేసీఆర్, కేటీఆర్ ఉన్నారు. మీతో మోడీ, జగన్ జత కట్టి ఏపీ ప్రజలకు ద్రోహం చేస్తారా… సిగ్గుండాలి. రాజ్యాంగ విరుద్దంగా వెళుతున్న మీ అందరూ తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఎన్నికల కమిషన్ కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మాకు ఓట్లు తొలగించాల్సినంత ఖర్మ పట్టలేదు. ఓటమి భయంతో మీరు హడావుడి చేసి దొరికిపోయారు” అని ఫైరయ్యారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
