సాధారణంగా ప్రేమ, పగ, డబ్బు, అహం.. ఇంకా మరేదైనా కారణం వల్ల హత్యలు చేస్తుంటారు. కారణమేంటనేది హత్య జరిగిన కొన్ని రోజుల్లోనే బయటపడుతుంది. కానీ.. ఈ హత్యకు కారణమేంటి? ఎవరు చంపారు? ఎలా చంపారు? అసలు చనిపోయింది ఎవరు? అని తెలుసుకునేందుకు ఎంతోమంది ప్రయత్నించారు. హత్య జరిగి 70 ఏండ్లు గడుస్తున్నా ఈ హత్య గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదు. పోలీసులతో పాటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కూడా ఈ కేసును ట్రేస్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యాయి.
దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ప్రాంతంలో సోమర్టన్ బీచ్. చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడూ జనాలతో కిటకిటలాడుతుంటుంది.1948, నవంబర్ 30. టైం సాయంత్రం7 గంటలు. బీచ్ దగ్గర వాతావరణం ప్రశాంతంగా ఉంది. అదే టైంలో జాన్ బెయిన్ లియోన్స్ అనే గోల్డ్ స్మిత్, అతని భార్య సోమర్టన్ బీచ్‌లో షికారు చేయడానికి వెళ్లారు. బీచ్‌లో నడుస్తూ.. అక్కడే పడుకుని రెస్ట్ తీసుకుంటున్న ఒక వ్యక్తిని చూశారు. రాళ్లకు వీపు ఆనించి, సముద్రం వైపు చూస్తున్నాడు అతను.
అరగంట తర్వాత వాళ్లు మళ్లీ అటు వైపు వచ్చారు. అప్పుడు కూడా అదే పొజిషన్లో కూర్చుని ఉన్నాడు అతను. కదలకుండా ఉండడంతో నిద్రపోతున్నాడేమో అనుకున్నారు. కానీ... అతని ముఖంపై దోమలు వాలుతున్నాయి. దాంతో లియోన్స్ తన భార్యతో ‘‘అతను చనిపోయినట్టు ఎలా పడుకున్నాడో చూడు” అని జోక్ చేశాడు. మరుసటి ఉదయం లియోన్స్ మళ్లీ అదే ప్లేస్‌కి వచ్చాడు. ముందు రోజు ఆ వ్యక్తిని చూసిన చోట చాలామంది గుమిగూడారు. ఏంటా! అని వెళ్లి చూస్తే.. ఆ వ్యక్తి చనిపోయాడు. అది చూసి లియోన్స్ ఆశ్చర్యపోయాడు. ముందురోజు సాయంత్రమే అతన్ని పలకరించి ఉంటే స్పృహలో లేడనే విషయం తెలిసేది అనుకున్నాడు.
ఇక ఆ వ్యక్తి విషయానికి వస్తే.. అతనెవరనేది ఎవరికీ తెలియదు. అతన్ని చంపారు అనడానికి ఎలాంటి గుర్తులు లేవు. బట్టలు కొంచెం కూడా నలగలేదు. అక్కడివాళ్లకు అతని చావు ఒక మిస్టరీలా అనిపించింది. అందుకే దీన్ని ‘సోమర్టన్ బీచ్ మిస్టరీ’ అని పిలుస్తారు. శవాన్ని పరిశీలించి, మూడు గంటల తర్వాత బాడీని రాయల్ అడిలైడ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరీక్షలు చేసి అతని చావుకు కారణం గుండె ఆగిపోవడమేనని నిర్ధారించారు. అతనిపై విష ప్రయోగం జరగడం వల్లే గుండె ఆగిపోయి ఉంటుందని అనుమానించారు.
ఆధారం దొరకలేదు
అతను ఎవరనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్లు అనేక ప్రయత్నాలు చేశారు. అతని దగ్గర దొరికిన అన్ని వస్తువులు పరిశీలించారు. కానీ.. ఒక్క ఆధారం కూడా దొరకలేదు. అతని ప్యాంట్ జేబులో అడిలైడ్ నుండి బీచ్‌కి వెళ్లే బస్ టిక్కెట్లు, ఒక చూయింగ్ గమ్ ప్యాకెట్, కొన్ని అగ్గి పుల్లలు, రెండు దువ్వెనలు, కెన్సిటాస్ అనే ఖరీదైన బ్రాండ్‌కు చెందిన ఏడు సిగరెట్లు ఉన్నాయి. కానీ.. ఆ సిగరెట్లు మరో కంపెనీ ‘ఆర్మీ క్లబ్’ సిగరెట్ల ప్యాకెట్లో ఉన్నాయి. జేబులో వాలెట్ కూడా ఉంది. కానీ.. అందులో చిల్లి గవ్వ లేదు. ఐడెంటిటీ కార్డ్స్ లేవు. సాధారణంగా అప్పట్లో ఏ టైలర్బట్టలు కుట్టినా, ఆ షాప్ పేరు, అడ్రస్ ఉండే చిన్న లేబుల్‌ని ప్యాంట్‌కి తగిలించి కుట్టేవారు. కానీ.. అతని బట్టల మీద ఏ లేబుల్ లేదు. అతను ఎవరో తెలుసుకునేందుకు ఒక్క ఆధారం కూడా దొరకలేదు.
శవ పరీక్ష
శవ పరీక్ష చేసిన డాక్టర్లు ‘‘అతని స్ప్లీన్ (ప్లీహం) మామూలు సైజు కంటే మూడు రెట్లు పెద్దగా ఉంది. లివర్‌లో రక్తం నిండిపోయింద’’ని చెప్పారు. పాథాలజిస్ట్ జాన్ డ్వైర్.. ‘‘అతను చివరిగా తిన్న ఫుడ్‌లోనే విషం కలిసి ఉండొచ్చ’’న్నాడు. కానీ.. ఆ విషం ఏంటనేది మాత్రం గుర్తించలేకపోయారు. ఫుడ్‌లో విషం కలిసిందనేది కేవలం అంచనా మాత్రమే. అందుకు తగిన ఆధారాలేవీ దొరకలేదు. కానీ.. బీచ్‌లో అతన్ని చూసినవాళ్లు తాగుబోతు కాబోలు అనుకున్నారు. అందుకే పోలీసులు కూడా అతనేదైనా డ్రగ్ తీసుకున్నాడేమో అని టెస్ట్‌లు చేయించారు. రక్తాన్ని పరీక్షించినా.. ఏమీ తేల్చలేకపోయారు. విషం ఆనవాళ్లు గుర్తించలేకపోయారు.
స్పెషల్ పాయిజన్
ప్రఖ్యాత ప్రొఫెసర్ సర్ సెడ్రిక్ స్టాంటన్ హిక్స్ ఈ కేసును స్టడీ చేసి కొన్ని విషయాలు చెప్పాడు. ‘‘కొన్ని రకాల అరుదైన విషాలు ప్రయోగిస్తే.. మనిషి చనిపోయిన కొద్దిసేపటికే శరీరంలో విషపు ఆనవాళ్లు కనుమరుగవుతాయి. అలాంటి విషాన్నే ఇతనిపై ప్రయోగించి ఉండొచ్చు. ఈ రకం విషాలు చాలా ప్రమాదకరమైనవి. బాడీ నుంచి ఆ విషం చాలా త్వరగా బయటికి వచ్చేస్తుంది. ఇలాంటి విషాలు ఆఫ్రికాలో దొరికే కొన్ని రకాల మొక్కల విత్తనాల నుండి తయారుచేస్తారు” అని చెప్పాడు హిక్స్.
సూట్‌కేస్
అతనెవరో తెలుసుకోవడం కష్టమని భావించిన పోలీసులు ఆ శవం గురించి పేపర్లలో ప్రకటన వేయించారు. అతని గురించి తెలిసినవాళ్లు.. పోలీసులను సంప్రదించాలని చెప్పారు. ఆస్ట్రేలియా అంతటా ప్రచారం చేసినా ఒక్కరు కూడా అతను తెలుసని రాలేదు. తర్వాతి ఏడాది జనవరి 11 వరకు ఆస్ట్రేలియా పోలీసులు కేసుకు సంబంధించిన ప్రతి లీడ్‌ను పరీక్షించారు. కానీ.. ఆధారాలు దొరకలేదు. అప్పుడు అతనిది ఆ ప్రాంతం కాదని డిసైడ్ అయ్యారు. అంటే అతను వేరే ప్రాంతం నుంచి వచ్చి ఉంటాడు. కాబట్టి కచ్చితంగా తనవెంట లగేజీ తీసుకొచ్చే ఉంటాడని అనుమానించారు. ఆ లగేజీ గురించి ఎంక్వైరీ చేశారు. ప్రతి హోటల్, డ్రై క్లీనర్ షాపులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు.. ఇలా ఎక్కడా వదలకుండా వెతికారు. దాంతో ఒక ‘క్లూ’ దొరికింది. అడిలైడ్‌లోని రైల్వే స్టేషన్‌కు వెళ్లిన డిటెక్టివ్‌లకు అక్కడి సిబ్బంది నవంబర్30న ఒక వ్యక్తి క్లాక్‌రూమ్‌లో వదిలి వెళ్లిన గోధుమ రంగు సూట్‌కేస్‌ను చూపించారు. అది అతనిదే అని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. చనిపోయిన వ్యక్తి ప్యాంటు చిరిగినప్పుడు కుట్టడానికి వాడిన ఆరెంజ్ రంగు దారం రీల్ సూట్‌కేసులో దొరికింది. అందులోఉన్న బట్టలకు కూడా లేబుల్స్, ప్రైస్ ట్యాగ్లు లేవు. ఆస్ట్రేలియాలో ఎవరికీ పెద్దగా తెలియని ఒక రకమైన కుట్టు ఉపయోగించి సూట్‌కేసులోని కోటు కుట్టారు. ఈ ఆధారాలతో ఏదైనా ‘క్లూ’ దొరకొచ్చనే ఆశతో మళ్లీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ప్రొఫెసర్ జాన్ క్లెలాండ్ చనిపోయినప్పుడు అతను వేసుకున్న ప్యాంట్‌కి నడుము భాగంలో సీక్రెట్ జేబు ఉన్నట్టు గుర్తించాడు. ఆ జేబు చాలా చిన్నగా ఉండడం వల్ల అంతకుముందు ఎగ్జామిన్ చేసినవాళ్లు దాన్ని గుర్తించలేకపోయారు. ఆ జేబులో ఒక చిన్న కాగితం ఉంది. దానిపై ‘‘తమామ్ – షుద్” అనే రెండు పదాలు రాసి ఉన్నాయి. కెన్నెడీ అనే రిపోర్టర్ వాటి మీద రీసెర్చ్ చేస్తే.. అవి పర్షియన్ పదాలని, ఆ కాగితం ఒమర్ ఖయ్యామ్ అనే కవి రాసిన ‘రుబయ్యాత్’ అనే పుస్తకం చివరి పేజీ నుంచి చింపారని చెప్పాడు. ఆ పదాలకి అర్థం ‘‘ది ఎండ్’’. ఆ పుస్తకం పన్నెండో శతాబ్దంలో రాశారు. దాంతో అది హత్య కాదని, అతను ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానించారు కొందరు పోలీసులు. కానీ.. ఆ విషయాన్ని ఎవరికో చెప్పాలి అనుకున్నాడు. అందుకే ప్యాంట్ సీక్రెట్ పాకెట్లో ‘ది ఎండ్’ అని రాసి ఉన్న కాగితం పెట్టుకున్నాడని నమ్మారు. కానీ.. ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటే అరుదైన విషం తాగాల్సిన అవసరమేంటి? ఎలా అయినా చనిపోవచ్చు కదా!
ఖననం
ఒక పక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది.. శవం కుళ్లిపోవడం మొదలైంది. దాంతో పోలీసులు ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ, కేసు ఎప్పుడైనా రీ ఓపెన్ చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఖననం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. శవాన్ని మళ్లీ తవ్వి తీయడానికి ఈజీగా ఉండే పొడి నేలలో కింద కాంక్రీటు వేసి ఖననం చేశారు.
రుబాయిత్ కోసం
ఖననం తర్వాత మళ్లీ ఎంక్వైరీ మొదలుపెట్టారు. చివరి పేజీలో కాగితం చిరిగిన ఆ రుబయ్యాత్ పుస్తకం కోసం వెతికారు. కొన్నాళ్లకు ఒక వ్యక్తి అడిలైడ్‌లోని డిటెక్టివ్ ఆఫీస్‌కి ఆ పుస్తకం కాపీ తీసుకొచ్చాడు. నవంబర్ 30న సోమర్టన్ బీచ్‌కు కొంత దూరంలో కారులో వెళ్తుండగా అతనికి ఆ పుస్తకం దొరికింది. పేపర్లో న్యూస్ చూసి, ఆ పుస్తకం చివరి పేజీలు చిరిగి ఉండడంతో దాన్ని డిటెక్టివ్ ఆఫీస్‌లో అప్పగించాడు. డిటెక్టివ్ సార్జెంట్ లియోనెల్ లీన్ పుస్తకాన్ని పరిశీలించి.. దాని వెనుక కవర్‌పై పెన్సిల్‌తో రాసిన టెలిఫోన్ నెంబర్‌ను గమనించాడు. ఆ నెంబర్ సోమర్టన్ బీచ్ దగ్గర్లో ఉండే ఒక నర్సుది. ఆమె పేరు జస్టిన్. ఆమె ఆ పుస్తకాన్ని తనకు తెలిసిన వ్యక్తి బాక్సాల్కు ఇచ్చినట్టు చెప్పింది. దాంతో మిస్టరీ వీడిందని అందరూ అనుకున్నారు. వెంటనే పోలీసులు బాక్సాల్ అడ్రస్ కనుక్కుని న్యూ సౌత్ వేల్స్‌లోని మారుబ్రా ప్రాంతంలో ఉన్న అతని ఇంటికి వెళ్లారు. తీరా చూస్తే.. బాక్సాల్ బతికే ఉన్నాడు. జస్టిన్ ఇచ్చిన రుబయ్యాత్ పుస్తకం అతని దగ్గర భద్రంగా ఉంది. దాని మీద కూడా నర్స్ ఫోన్ నెంబర్ ఉంది. దాంతో అందరూ తలలు పట్టుకున్నారు.
ఈ కేసును స్టడీ చేసివాళ్లలో కొందరు చనిపోయిన వ్యక్తి ఎవరనేది జస్టిన్‌కు తెలుసని నమ్మారు. బాక్సాల్కు ఇచ్చినట్టు తన ఫ్రెండ్స్‌లో చాలామందికి జస్టిన్ ఈ పుస్తకం ఇచ్చి ఉంటుంది. లేదా అతను ఆమె బాయ్‌ఫ్రెండ్ అయ్యుండొచ్చు. కానీ.. ‘‘తమామ్– షుద్’’ అనే పదాలు జేబులో ఎందుకు పెట్టుకున్నట్టు?
స్పై కావొచ్చు!
చనిపోయిన వ్యక్తికి దాదాపు40 ఏండ్ల వయసు ఉంటుంది. ఆ వయసులో కూడా చాలా ఫిట్‌గా ఉన్నాడు. కండరాలు బలంగా ఉన్నాయి. అతని కాలి కండరాలు చూస్తే అతను ఒక అథ్లెట్ అనిపిస్తుంది. అతను బాగా పరుగెత్తగలడు. ఇవన్నీ చూసి.. అతను విదేశీ గూఢచారి అనుకున్నారు. పోలీసులు కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు. ఏదో మిషన్ కోసం ఆస్ట్రేలియా వచ్చి ఉంటాడు అనుకున్నారు. అతని జేబులో దొరికింది ఒక కోడ్ అయ్యుండొచ్చు. దాన్ని తన పై అధికారులకి చెప్పాలి అనుకున్నాడేమో అని చాలామంది అనుకున్నారు. కానీ.. ఇంతకీ అతనెవరు? ఎందుకు ఆస్ట్రేలియా వచ్చాడు? ఎందుకు చనిపోయాడు? అనే విషయాలు ఇప్పటికీ తెలియలేదు. ఆ తర్వాత అతను ఎవరనేది తెలిసినట్టు చాలా వార్తలు వచ్చాయి. కానీ.. పక్కా ఆధారాలు మాత్రం దొరకలేదు.
