- కమీషన్ ఏజెంట్ల ముసుగులో విలువైన స్థలం కొట్టేసేందుకు ప్లాన్
- మున్సిపాలిటీకి తెలియకుండానే డ్రైనేజీ నిర్మాణం
- మార్కెట్ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చినా బేఖాతర్
గద్వాల, వెలుగు : గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు కమీషన్ ఏజెంట్లు స్కెచ్ వేశారు. పక్కా ప్లాన్‌తో మున్సిపాలిటీకి తెలియకుండానే మార్కెట్ యార్డ్ సమీపంలోని డ్రైనేజీని కూలగొట్టి, కొత్త డ్రైనేజీ నిర్మిస్తున్నారు. ఆ ముసుగులో స్థలాన్ని కబ్జా చేసి రైల్వే స్టేషన్ రోడ్డు వైపు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టేందుకు పావులు కదుపుతున్నారు. దాదాపు 20 ఫీట్లు ఉన్న డ్రైనేజీని మున్సిపాలిటీకి తెలియకుండా కులగొట్టి, దాన్ని 10 ఫీట్ల డ్రైనేజీగా మార్చేసి స్పీడ్‌గా పనులు చేస్తున్నారు.
తామే సొంతంగా డ్రైనేజీ కట్టుకుంటున్నామని కలరింగ్ ఇస్తూ.. కబ్జాకు తెరలేపారని పలువురు కమీషన్ ఏజెంట్లతో పాటు ట్రేడర్స్ ఆరోపిస్తున్నారు. డ్రైనేజీ స్థలంతో పాటు 20 ఫీట్ల రోడ్డు, మరికొంత మార్కెట్ యార్డ్ స్థలాన్ని కబ్జా చేసుకుని షాపింగ్ కాంప్లెక్స్ కట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. వాస్తవంగా మార్కెట్ యార్డ్ లో ఏమైనా నిర్మాణాలు చేయాలంటే, మార్కెట్ కమిటీ ఆఫీసర్ల పర్మిషన్ ఉండాలి.
ఇవేమి లేకుండా ఏకపక్షంగా 26 మంది కమీషన్ ఏజెంట్లు తమకు అనుకూలంగా ఉండేలా నిర్మాణాలు చేసుకుంటున్నారు. విషయాన్ని గుర్తించి మార్కెట్ సెక్రటరీ నోటీసు ఇచ్చారు. దీనిని బేఖాతర్ చేస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు.
రూల్స్ కు విరుద్ధంగా నిర్మాణాలు..
గద్వాల వ్యవసాయ మార్కెట్ 1972లో ఏర్పాటైంది. 62 ఎకరాల 26 గుంటల్లో మార్కెట్ యార్డ్ విస్తరించి ఉంది. గతంలో కొంత మంది కమీషన్ ఏజెంట్లకు కొన్ని రూల్స్ పెట్టి స్థలాన్ని అమ్మారు. మార్కెట్ యార్డ్ చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్‌ను ఎట్టి పరిస్థితుల్లో తొలగించకూడదు. ఏమైనా నిర్మాణాలు చేసినా.. అవి మార్కెట్ యార్డ్ కు అనుబంధంగా ఉండాలి.
కానీ, రైల్వే స్టేషన్ రోడ్ వైపు డిమాండ్ పెరగడంతో ఆ రోడ్డు పక్కన ఉన్న 20 ఫీట్ల డ్రైనేజీని, 10 ఫీట్లకు కుదించి, మార్కెట్ యార్డ్ కాంపౌండ్ వాల్ తొలగించి రోడ్డు ఫేసింగ్ వైపు షాపింగ్ కాంప్లెక్స్ కట్టేందుకు వ్యాపారులు ప్లాన్ చేస్తున్నారు. లీడర్లతో కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని అంటున్నారు. ఈ వ్యవహారంలో పెద్ద తలకాయలతో పాటు చాలా మందికి ముడుపులు ముట్టాయనే ఆరోపణలున్నాయి.
నోటీసులు ఇచ్చినా బేఖాతర్..
మార్కెట్ యార్డ్ కాంపౌండ్ వాల్ పాక్షికంగా దెబ్బతినడంతో పాటు మార్కెట్ యార్డ్ కు, మున్సిపాలిటీకి తెలియకుండా డ్రైనేజీని కూలగొట్టి కొత్త నిర్మాణం చేస్తుండగా, మార్కెట్ ఆఫీసర్లు కమీషన్ ఏజెంట్లకు నోటీసులు ఇచ్చారు. అయితే వీటిని బేఖాతరు చేస్తూ పనులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మార్కెట్ లో రెండెకరాల స్థలాన్ని అప్పటి గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు తీసుకుందని
టౌన్ పోలీస్ స్టేషన్ కు ఎకరా స్థలాన్ని కేటాయించారని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు కొంత స్థలం తీసుకొని మార్కెట్ యార్డ్ ఉనికి కోల్పోయేలా చేస్తున్నారని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా మార్కెట్ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నోటీసులు ఇచ్చాం..
డ్రైనేజీ నిర్మాణం చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. కాంపౌండ్ వాల్ కూడా కొంత దెబ్బతిన్నది. ఈ విషయాలపై వివరణ ఇవ్వాలని 26 మంది కమీషన్ ఏజెంట్లకు నోటీసులు ఇచ్చాం. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. మార్కెట్ స్థలాన్ని కబ్జా కాకుండా చూస్తాం.
నర్సింహులు, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ, ఏఎంసీ, గద్వాల