- పర్మిషన్ లేకుండా మట్టి తరలిస్తున్నా పట్టించుకోని ఆఫీసర్లు
- రెవెన్యూ, పోలీస్, మైనింగ్ ఆఫీసర్ల దోబూచులాట
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. ప్రభుత్వ భూములు, గుట్టలే టార్గెట్ గా అక్రమ మట్టి దందాను కొనసాగిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. పట్టపగలు జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్లతో గట్టు మండలంలోని చిన్నోనిపల్లి ఆర్అండ్ఆర్ సెంటర్ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో ఉన్న ఎర్రగట్టు మట్టిని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని చిన్నోనిపల్లి, చాగదోన గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
పోలీస్, రెవెన్యూ, మైనింగ్ ఆఫీసర్లు తమకు తెలియదంటే.. తమకు తెలియదంటూ తప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు. 200 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎర్రగట్టు మట్టి మాఫియా దెబ్బకు కరిగిపోయిందని అంటున్నారు. ఇప్పటికే భారత్ మాల ముసుగులో కొండలు, గుట్టలను కరగదీసిన మేఘా కంపెనీకి తోడు ఇప్పుడు లోకల్ మట్టి మాఫియా గుట్టలను అక్రమంగా తవ్వేసి సొమ్ము చేసుకుంటోంది.
హ్యాండ్లూమ్ పార్క్, ఎర్రగట్టే టార్గెట్..
గద్వాల మండలం అనంతపురం దగ్గర హ్యాండ్లూమ్ పార్క్ కోసం ఏర్పాటు చేసిన స్థలంలోని మట్టిని రాత్రి, పగలు అనే తేడా లేకుండా తోడేస్తున్నారు. ఇప్పటికే హ్యాండ్లూమ్ పార్క్ అంతా గుంతలమయంగా మారి పనికి రాకుండా పోయింది. అలాగే గట్టు మండలం చిన్నోనిపల్లి విలేజ్ దగ్గర 200 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎర్రగట్టును వదలడం లేదు. మట్టి తవ్వకాల్లో మాఫియా పోటీ పడుతోంది. లీడర్ల ముసుగులో మట్టి మాఫియా అవతారం ఎత్తి గుట్టలు, కొండలు కరగదీస్తున్నారు. రాజకీయ నేతల జోక్యంతో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ ఆఫీసర్లు సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. టిప్పర్ మట్టిని రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు, ట్రాక్టర్ మట్టిని రూ.వెయ్యి నుంచి రూ.1,500 అమ్ముతున్నారు.
మాఫియాలో ఆధిపత్య పోరు..
గద్వాల నియోజకవర్గంలోని మట్టి మాఫియాలో నాలుగు గ్రూపులు ఉన్నాయి. వీరంతా ప్రభుత్వ భూములు, గుట్టల్లో మట్టిని తరలించేందుకు పోటీ పడుతున్నారు. నెల రోజుల నుంచి వీరి మధ్య ఆధిపత్య పోరు మితిమీరిపోయింది. వారి టిప్పర్లు మట్టిని అక్రమంగా కొడుతున్నాయంటే.. వారి టిప్పర్లు మట్టిని అక్రమంగా కొడుతున్నాయంటూ.. ఇటీవల పోలీసులకు రెండు వర్గాలు కంప్లైంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వారి ఆధిపత్య పోరుతో రెండు వర్గాలకు చెందిన వారిపై కేసులు నమోదయ్యాయి. అయితే మట్టి దందా మాత్రం ఆగలేదు.
Also Read : జహీరాబాద్ ట్రైడెంట్ లోక్రషింగ్ కష్టమే!...చేతులెత్తేసిన యాజమాన్యం
ఆఫీసర్ల దోబూచులాట..
మట్టి మాఫియాను అరికట్టాల్సిన శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో రెవెన్యూ, మైనింగ్, పోలీస్ ఆఫీసర్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మైనింగ్ ఆఫీసర్లకు చెబితే రెవెన్యూ ఆఫీసర్లకు చెప్పాలని, రెవెన్యూ ఆఫీసులకు చెబితే పోలీసులకు చెప్పాలని సమాధానం ఇస్తూ తప్పించుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. చిన్నోనిపల్లి ఆర్అండ్ఆర్ సెంటర్ దగ్గర ఉన్న ఎర్రగట్టు నుంచి మట్టి తరలిస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కింది స్థాయి ఆఫీసర్లు స్పందించకపోవడంతో గ్రామస్తులు ఏకంగా ఎస్పీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదు..
హ్యాండ్లూమ్ పార్క్, ఎర్రగట్టు ప్రభుత్వ స్థలాల్లో మట్టి తవ్వకాలకు ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదు. ఎర్రగట్టు మట్టి తరలింపు విషయంలో పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. సిబ్బంది కొరత కారణంగా మండలాల్లో పర్యటించలేకపోతున్నాం. మట్టి మాఫియాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – రమణ, మైనింగ్ ఏడీ, గద్వాల