భర్త వేధింపులతో ఐటీ ఎంప్లాయ్​ సూసైడ్

  • పొలం తన పేరిట రాయమని  ఒత్తిడి 
  • తట్టుకోలేక గడ్డి మందు తాగింది
  • హైదరాబాద్ లోని మియాపూర్ లో ఘటన

మియాపూర్, వెలుగు: భర్త వేధింపులు తట్టుకోలేక ఓ సాఫ్ట్​వేర్​ ఎంప్లాయ్​ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన  హైదరాబాద్ మియాపూర్​లో జరిగింది.  ఏపీలోని ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిట్టాపూర్ ​గ్రామానికి చెందిన వెంకట నాగలక్ష్మి(29) గచ్చిబౌలిలోని అసెంచర్ ​కంపెనీలో ఐటీ ఎంప్లాయ్. ఆమెకు భీమవరానికి చెందిన సతీశ్​తో 2018లో పెండ్లి అయింది.   2019లో వీరికి పాప పుట్టింది. అనంతరం దంపతులు మధ్య  మనస్పర్థలు రావడంతో 2023లో విడాకులు పొందారు. 

గత ఆగస్టు 22న ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం తోచిలుకకు చెందిన సివిల్ కాంట్రాక్టర్ మొవ్వ మనోజ్​తో నాగలక్ష్మికి రెండో పెండ్లి అయింది. కట్నం కింద 1.5 ఎకరాల వ్యవసాయ భూమి ని తండ్రి కూతురి పేరిట రిజిస్ట్రేషన్ ​చేసి ఇచ్చాడు.  ఐదేండ్ల పాపతో కలిసి దంపతులు మియాపూర్ ​గోకుల్​ప్లాట్స్ లో  కాపురం పెట్టారు. ఆమె ఆఫీసుకు వెళ్తుండగా, మనోజ్​ఖాళీగా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇటీవల మనోజ్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. కట్నం కింద ఇచ్చిన భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు. 

మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు.  ఆమెను అనుమానిస్తూ బూతులు తిడుతూ కొడుతున్నాడు. ఐదేండ్ల పాపను హాస్టల్​లో జాయిన్​చేయాలని, తమతో వద్దని వేధిస్తున్నాడు. తన అవసరాలకు డబ్బు ఇవ్వాలని, ఫోన్​పే, గూగుల్​పే పాస్​వర్డ్​లు చెప్పాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. నెల రోజుల కింద మరోసారి తీవ్రంగా భార్యను కొట్టాడు.  ఆమె తన అత్త లక్ష్మి దృష్టికి తీసుకెళ్లగా కొడుకుకే మద్దతుగా మాట్లాడింది. తట్టుకోలేకపోయిన బాధితురాలు ఫోన్ ​చేసి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. 

ఆన్ లైన్ ఆర్డర్ లో గడ్డి మందు తెప్పించుకుని..

 వెంకట నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. గత నెల 28న బిగ్ హాట్.కామ్​ వెబ్​సైట్​లో  గడ్డిమందును ఆర్డర్ ​చేయగా.. ఈనెల 4న డెలివరీ అయ్యింది. ఈ నెల 11న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేనప్పుడు గడ్డి మందు తాగింది. ఇంటి యజమాని చూసి వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఆమెను కేపీహెచ్​బీలోని ఓ ప్రైవేటు హాస్పటల్ కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. తన కూతురు మృతికి భర్త మనోజ్, అత్త లక్ష్మి కారణమని శ్రీనివాసరావు మియాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన  శుక్రవారం మృతురాలి భర్త మనోజ్​ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.