రెండో పెండ్లికి ఒప్పుకోలేదని కరెంట్ పోల్ ఎక్కిండు

రెండో పెండ్లికి ఒప్పుకోలేదని కరెంట్ పోల్ ఎక్కిండు

ధోల్పూర్(రాజస్థాన్): మార్కులు తక్కువ వచ్చినయని తండ్రి తిట్టిండనో.. ప్రేమించిన అమ్మాయితో పెండ్లి కోసమో యువత టవర్లు, ట్యాంకులు ఎక్కడం చాలాచోట్ల చూశాం. వాళ్లను కిందికి దించేందుకు పేరెంట్స్ బెట్టు వీడి అడిగిందానికి ఒప్పుకోవడం విన్నాం.. ఇదేదో బాగుందని రాజస్థాన్లో ఓ పెద్దాయన కూడా ఇట్లనే చేసిండు. ఓ కరెంట్ స్తంభాన్ని చూసుకుని పైకెక్కిండు. పెళ్లికి ఒప్పుకుంటెనే దిగొస్తనని చెప్పిండు. అరవై ఏండ్ల వయసులో ఆయన మంకుపట్టు చూసి కుటుంబ సభ్యులు పరేషాన్ అయ్యిన్రు. ఇంతకీ పెద్దాయన డిమాండ్ ఏందయా అంటే.. తనకు రెండో పెళ్లి కావాలట, కొడుకులు కోడళ్లు అందరూ దానికి ఒప్పుకోవాలట. రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు.. జిల్లాలోని మాధా భావు గ్రామానికి చెందిన సోబ్రాన్ సింగ్కు అరవై ఏండ్లు.. భార్య చనిపోవడంతో కొడుకులతో కలిసి ఉంటున్నడు. మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తున్నడు. ఇంటినిండా మనుషులు ఉన్నా భార్యలేని లోటు బాధించడంతో సింగ్ మరో పెండ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యిండు. ఇంట్లో వాళ్లకూ ఓ మాట చెప్పిచూద్దామని ప్రయత్నించగా.. ఈ వయసులో నీకు పెళ్లేంటని వాళ్లు మండిపడ్డరు. దీంతో సింగ్ హర్టయ్యిండు. తర్వాత రోజు ఊళ్లోని ఓ కరెంట్ స్తంభం ఎక్కి కూచున్నడు. పెద్దాయనకు ఎక్కడ షాక్ తగులుద్దో, పట్టుతప్పి ఎక్కడ కిందపడతడోనని సింగ్ ఇంట్లో వాళ్లే కాదు ఊరోళ్లు కూడా కంగారు పడ్డరు. కరెంటోళ్లకు ఫోన్ చేయడంతో వాళ్లు పవర్ సప్లై ఆపేశారు. దాదాపు గంటకు పైగా సింగ్ స్తంభంపైనే ఉన్నడు. గ్రామానికి చెందిన ఓ యువకుడు  సింగ్ను బుజ్జగించి మెల్లగా పోల్ ఎక్కి జాగ్రత్తగా కిందికి దింపిండు.