సబ్బులు, బిస్కట్ల కంపెనీలకు మళ్లీ తిప్పలు

సబ్బులు, బిస్కట్ల కంపెనీలకు మళ్లీ తిప్పలు

చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్లే కారణం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఎత్తేసిన తరువాత సబ్బులు, షాంపూలు, చాకెట్లు, బిస్కెట్ల వంటి  వస్తువులు అమ్మే ఎఫ్‌‌ఎంసీజీ కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి. గత నెల నుంచే అమ్మకాలు పుంజుకున్నాయి. అన్ని చోట్లా సప్లైకి ఇబ్బందులు తొలగిపోయాయి. అయితే ఈ కంపెనీల సంతోషం ఎంతోకాలం నిలిచేలా లేదు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో చాలా రాష్ట్రాల్లో తిరిగి లాక్డౌన్లు మొదలవుతున్నాయి. కొన్ని నగరాల్లో వ్యాపారులే సొంతంగా లాక్డౌన్ విధించుకుంటున్నారు. షాపులను ఓపెన్ చేయడం లేదు. దీంతో ఈ ఎఫ్‌‌ఎంసీజీ వస్తువుల కంపెనీల సప్లై చెయిన్ దెబ్బతింది. ట్రక్కులు గమ్యస్థానం చేరుకోవడం కష్టమవుతోంది. వస్తువుల మాన్యుఫ్యాక్చరింగ్ పైనా ఎఫెక్ట్ కనిపిస్తోందని, ప్రస్తుతం పాత స్టాకులనే అమ్ముతున్నామని గోద్రెజ్, ఐటీసీ వంటి కంపెనీలు అంటున్నాయి. లాక్డౌన్, అన్లాక్డౌన్లతో సతమతమవుతున్నామని చెబుతున్నాయి. లోకల్ ప్రొడక్షన్ యూనిట్లకు, గోదాములకు లేబర్ దొరక్కపోవడంతో సమస్యలు వస్తున్నాయి. ‘‘లాక్డౌన్లపై చర్చ జరగాలి. మా సప్లై చెయిన్లు దెబ్బతింటున్నాయి. ఇదొక విచిత్రమైన పరిస్థితి. మున్ముందు ఏం జరగుతుందో అర్థం కావడం లేదు. ఎక్కడ ఎప్పుడు లాక్డౌన్ అంటారో తెలియడం లేదు. ఒక్కో చోట ఉంటూ మరొక చోట ఉండకపోవడంతో సమస్యలు వస్తున్నాయి”అని గోద్రెజ్ ఇండియా, సీఈఓ సునీల్ కటారియా వివరించారు. కొత్త లాక్డౌన్ల వల్ల కచ్చితంగా సమస్యలు వస్తాయని ఐటీసీ భయపడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో తాత్కాలిక లాక్డౌన్ల వల్ల స్థానికంగా సరుకులను చేరవేయడానికి ఇబ్బందులు ఏర్పడతాయని, మాన్యుఫ్యాక్చరింగ్ కూడా ఆగిపోవచ్చని ఐటీసీ ఎగ్జిక్యూటివ్ ఒకరు అన్నారు. కటారియా కూడా ఇవే మాటలు అన్నారు. గత నెల పరిస్థితి బాగానే ఉన్నా, ఈ నెల ఉత్పత్తి తగ్గుతుందని అన్నారు. అయినప్పటికీ, తమ దగ్గర తగినంత స్టాక్ ఉందని చెప్పారు.

స్టాకులు పెంచుకోవాలి…

కరోనా కేసులు తగ్గే వరకూ ఇలాంటి లాక్డౌన్లు కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి ఎఫ్‌‌ఎంసీజీ తయారీ కంపెనీలు స్టాకులను వీలైనంత పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యమైన మార్కెట్లలో పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ, అందుకు తగ్గట్టు కంపెనీలు ప్లాన్లను మార్చుకోవాలని ఎర్నెస్ట్ యంగ్ కు  చెందిన పినానీరంజన్ మిశ్రా అన్నారు.