విజయవాడ: ఏపీలో మద్యం స్మగ్లర్లు కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నారు. చుట్టుపక్కల రాష్ట్రాల కంటే ఏపీలో ధరలు అధికంగా ఉండడంతో ఈ భారీ తేడాను సొమ్ము చేసుకునేందుకు అనేక మంది అనేక రకాలుగా చేస్తున్న ప్రయత్నాలు పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. చేపలు తరలించే ట్రేలలో మద్యం బాటిళ్లను పెట్టి ఆర్టీసీ బస్సుల్లో రవాణా చేస్తున్న వైనం కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
కంచికచర్ల మండలం దొనబండ చెక్ పోస్టు వద్ద పోలీసులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులను తనిఖీ చేస్తుండగా.. ఓ బస్సులో చేపలు తరలించే ట్రేలు కనిపించాయి. చేపల ట్రేలకు ఎక్కడా తడి లేకపోవడం.. కనీసం చేపల వాసన కూడా లేకపోవడంతో అనుమానం వచ్చి ట్రేలు ఓపెన్ చేయించగా.. మద్యం బాటిళ్లు కనిపించాయి. ఒకటి కాదు.. రెండు కాదు వరుసగా 10 ఆర్టీసీ బస్సుల్లో చేపల ట్రేలను తనిఖీ చేయగా.. 290 మద్యం బాటిళ్లు దొరికాయి.
