న్యూఢిల్లీ: ఎకానమిక్ స్లోడౌన్ వల్ల కార్లు మొదలుకొని బిస్కెట్ల వరకు డిమాండ్ తగ్గిందని కంపెనీలు మొత్తుకుంటున్నాయి. అయితే, స్మార్ట్‌ఫోన్ కంపెనీలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాయి. మిగతా రంగాలు ఇబ్బందుల్లో ఉన్నా ఇవి మాత్రం దూసుకెళ్తూనే ఉన్నాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల నుంచే కాదు పల్లెటూళ్ల నుంచి కూడా ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ విపరీతంగా కనిపించింది. ఫీచర్ ఫోన్ వాడే చాలా మంది స్మార్ట్‌ఫోన్లకు మారారు. కొందరేమో సాధారణ స్మార్ట్‌ఫోన్ వదిలేసి ఖరీదైన ఫోన్ కొన్నారు. కొత్త సంవత్సరంలోనూ స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇండియాలో స్మార్ట్‌ఫోన్లను తయారు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తుండడం కూడా వీటి అమ్మకాలను పెంచుతున్నాయి. ఆపిల్ వంటి ప్రముఖ బ్రాండ్లు ఇండియాలో ప్లాంట్లు పెట్టడానికి ప్రభుత్వాలు ఒప్పించగలిగాయి. 2020లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రెండంకెల గ్రోత్‌ను సాధిస్తుందని ఎక్స్‌పర్టులు అంటున్నారు. షాపింగ్ మొదలు బ్యాంకింగ్ వరకు అన్నింటికీ స్మార్ట్‌ఫోన్ కీలకం కావడం వల్ల వీటి అమ్మకాలు పెరుగుతాయని చెబుతున్నారు. ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో తొమ్మిది శాతం వృద్ధి ఉంటుందని, వచ్చే ఏడాది 12–14 శాతం ఉండొచ్చని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ అన్నారు. ఈ ఏడాది టాప్–5 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లుగా షావోమీ, శామ్‌సంగ్, వివో, ఒప్పో, రియల్‌మీ నిలిచాయి. సగటు అమ్మకం ధరలు (ఏఎస్‌పీ) కూడా దాదాపు రెట్టింపు అయ్యాయి. ఇవి రూ.ఐదు వేల నుంచి రూ.10 వేల వరకు, రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఎగిశాయి. 2025 నాటికి వంద కోట్ల ఫోన్లను తయారు చేయడమే టార్గెట్‌గా మోడీ ప్రభుత్వం కొత్త ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్ పాలసీని తీసుకొచ్చింది. సింగిల్ బ్రాండ్ రిటైల్ వందశాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఇచ్చింది. కార్పొరేట్ ట్యాక్స్‌ను 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. ఇలాంటి చర్యల కారణంగా ఆపిల్ వంటి కంపెనీలు ఇండియాకు వచ్చాయి. ప్రస్తుతం ఐఫోన్ ఎక్స్‌ఆర్ మనదేశంలోనే తయారవుతోంది. ఐఫోన్ కాంట్రాక్ట్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ సాల్‌కాంప్ కూడా ఇండియాలో ప్లాంటుకు రూ.రెండు వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.
వీటికి చాలా ఇంపార్టెన్స్
పవర్‌ఫుల్ సెన్సర్లతో కూడిన కెమెరాలు, ఎక్కువ మెమొరీ, పెద్ద స్క్రీన్, ఫాస్ట్‌ప్రాసెసర్.. స్మార్ట్‌ఫోన్ కస్టమర్లు ఈ నాలుగు అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని స్టడీల్లో తేలింది. కంపెనీలు కూడా ఇలాంటి వాటిపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాయి. కొన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు స్మార్ట్‌టీవీల తయారీని కూడా మొదలుపెట్టాయి. ఈ ఏడాది వన్‌ప్లస్, మోటొరోలా, నోకియా కంపెనీలు స్మార్ట్‌టీవీలను లాంచ్ చేశాయి. సోనీ, ఎల్జీ, శామ్‌సంగ్‌తో పోలిస్తే చాలా తక్కువ ధరలను నిర్ణయించాయి. స్మార్ట్‌టీవీ మార్కెట్లో షావోమీ వాటా 43 శాతానికి చేరింది. మరికొన్ని కంపెనీలు స్మార్ట్‌టీవీలతోపాటు ఫిట్‌నెస్ బ్యాండ్లు, స్మార్ట్‌వాచీలు, ఇయర్‌బడ్స్‌నూ విడుదల చేశాయి. అయితే స్మార్ట్‌ఫోన్లు, టీవీల పార్టులు స్థానికంగా దొరక్కపోవడం, దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండటం, స్కిల్డ్ లేబర్ దొరక్కపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కంపెనీలు కోరుతున్నాయి.
