జగన్ మీదకు చెప్పు విసిరిన గుర్తు తెలియని వ్యక్తి - భద్రతా వైఫల్యమేనా..?

సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశాడు. ప్రస్తుతం రాయలసీమలో సాగుతున్న జగన్ బస్సు యాత్రకు మంచి స్పందన వస్తోంది. అయితే, బస్సు యాత్ర కర్నూలు నుండి అనంతపురం జిల్లా గుత్తిలోని గాంధీ బొమ్మ సెంటర్ కి చేరుకున్న సమయంలో ఊహించని సంఘటన జరిగింది. రోడ్ షోలో భాగంగా  ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి జగన్ మీదకు చెప్పు విసిరాడు.ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మీదకు చెప్పు విసరడం కలకలం రేపింది.

అయితే, ఆ అఘంతకుడు విసిరిన చెప్పు జగన్ వద్దకు చేరకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నాడు. ఘటన జరిగిన వెంటనే అప్రత్తమైన సీఎం భద్రతా సిబ్బంది జగన్ ను రక్షణా వలయంలోకి తీసుకున్నారు. జగన్ మీద ఎలాంటి వస్తువులు పడకుండా షీల్డ్ అడ్డుగా పెట్టారు. ఇప్పటికే జగన్ భద్రత మీద ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్న నేపథ్యంలో విశాఖ, విజయవాడ విమానాశ్రయాల్లో రెండు హెలికాఫ్టర్లు లీజుకు తీసుకోవటం వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఈ ఘటనను వైసీపీ శ్రేణులు సీరియస్ గా తీసుకున్నాయి. భద్రతా వైఫల్యమే ఈ ఘటనకు కారణమని అంటున్నారు. విసిరింది చెప్పు కాబట్టి ప్రమాదం తప్పిందని, చెప్పు స్థానంలో ఏదైనా మారణాయుధం ఉండుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. జగన్ భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు.