టోకెన్లు ఇచ్చేందుకే గేట్ ఓపెన్ చేశారని భక్తులు అనుకోవడంతో.. తిరుపతిలో అసలేం జరిగిందంటే..

  • 40 మంది భక్తులకు అస్వస్థత..ఆస్పత్రులకు తరలింపు
  • వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం భారీగా తరలివచ్చిన జనం
  • టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాట ఘటనపై ప్రధాని మోదీ,చంద్రబాబు, రేవంత్ దిగ్ర్భాంతి

హైదరాబాద్, వెలుగు : ఏపీలోని తిరుపతిలో దారుణం జరిగింది. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలిరావడంతో బుధవారం తోపులాట చోటుచేసుకుంది. అది కాస్తా తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, దాదాపు 40 మంది అస్వస్థతకు గురయ్యారు. చనిపోయినోళ్లలో ఐదుగురు మగవాళ్లు, ఒక మహిళ ఉన్నారు. అస్వస్థతకు గురైన వాళ్లలో 20 మంది రుయా ఆస్పత్రిలో, మరో 9 మంది స్విమ్స్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 

అసలేం జరిగిందంటే?

వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని 9 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా జారీ చేస్తామని టీటీడీ ఇటీవల ప్రకటించింది. ఈ నెల 10,11,12 తేదీల్లో దర్శనానికి సంబంధించి లక్షా 20 వేల టోకెన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి జారీ చేస్తామని తెలిపింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రానికే భక్తులు భారీ సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు.శ్రీనివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాలకు భక్తులు పోటెత్తారు.

ఈ క్రమంలో భక్తులు రోడ్లపై గుమిగూడకుండా బైరాగిపట్టెడ వద్ద ఉన్న పద్మావతి పార్కులో ఉంచారు. అయితే అక్కడున్న టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించేందుకు గేట్ ఓపెన్ చేశారు. దీంతో టోకెన్లు ఇచ్చేందుకే గేట్ ఓపెన్ చేశారని అనుకున్న భక్తులు.. ఒక్కసారిగా క్యూలైన్ వద్దకు దూసుకొచ్చారు. ఇది కాస్తా తోపులాట, తొక్కిసలాటకు దారితీసింది.

ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి.. 

తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. భక్తులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. జిల్లా అధికారులతో చంద్రబాబు ఫోన్​లో మాట్లాడారు. గాయపడినోళ్లకు మెరుగైన ట్రీట్ మెం ట్ అందించాలని, ఘటనా స్థలంలో సహాయక చర్య లు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఘటనపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.