బీహార్ లో విషాదం: అగ్నిప్రమాదంలో ఆరుగురు చిన్నారులు మృతి

బీహార్ లో విషాదం: అగ్నిప్రమాదంలో ఆరుగురు చిన్నారులు మృతి

బీహార్ లో ఘోర విషాదం జరిగింది. అరారియా జిల్లా కబైయా గ్రామంలో ఓ పూరింట్లో చెలరేగిన మంటల్లో చిక్కుకొని ఆరుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మొక్క జొన్నలు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ చిన్నారులు బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. మంటల్లో చిక్కుకున్న చిన్నారుల అరుపులు విన్న స్థానికులు.. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. చిన్నారుల్ని కాపాడలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా 3 నుంచి ఆరేళ్లు లోపు చిన్నారులే.