సరిహద్దుల్లో ఎలాంటి మార్పులకూ ఒప్పుకోబోం

సరిహద్దుల్లో ఎలాంటి మార్పులకూ ఒప్పుకోబోం

న్యూఢిల్లీ: లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. లడఖ్‌‌లో దూకుడుగా వ్యవహరించినందుకు చైనా దళాలు ఊహించని పరిణామాలను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ‘లైన్ ఆఫ్ కంట్రోల్‌‌లో ఎలాంటి మార్పులకూ మేం ఒప్పుకోబోం. జమ్మూ కశ్మీర్‌‌లో పాకిస్తాన్‌‌తోపాటు భారత వ్యతిరేక శక్తులు నిరంతరాయంగా యుద్ధానికి కాలు దువ్వుతున్నాయి. దీంతో ఇండో-పాక్ సంబంధాలు దిగజారాయి. భారత్‌‌లోకి ఉగ్రవాదులను పంపుతున్న కుటిల పాకిస్తాన్‌‌కు బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్స్ ద్వారా బలమైన సందేశాన్ని పంపాం’ అని రావత్ పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా బార్డర్‌లో ఇండో-చైనాలు తమ సైన్యాలను మోహరించాయి. గల్వాన్ వ్యాలీలో ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది.