సిస్టర్ అభయ కేసులో దోషులు చర్చి ఫాదర్, నన్
28 ఏండ్ల తర్వాత సీబీఐ కోర్టు తీర్పు.. ఇయ్యాల శిక్ష ఖరారు
తిరువనంతపురం: 1992లో కేరళలోని కొట్టాయంలో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ(21) హత్య కేసులో తిరువనంతపురంలోని సీబీఐ స్పెషల్ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. చర్చి ఫాదర్ థామస్ కొట్టూర్, సిస్టర్ సెఫీలను దోషులుగా తేల్చింది. బుధవారం శిక్ష ఖరారు చేస్తామని వెల్లడించింది. హత్య జరిగిన 28 ఏండ్ల తర్వాత కేసులో తీర్పు వచ్చింది. సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి జస్టిస్ జె.సనాల్ కుమార్ తీర్పు చెప్పారు. ఈ కేసులో చర్చి ఫాదర్ పూథ్రకయాల్ కూడా నిందితుడు కాగా.. సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు రెండేళ్ల క్రితం నిర్దోషిగా ప్రకటించింది. కేసు విచారణ జరుగుతుండగానే సిస్టర్ అభయ తల్లిదండ్రులు 2016లో చనిపోయారు. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టు జోమన్ పుథెన్ పురక్కల్ ఇన్నేండ్లు పోరాడారు. కోర్టు తీర్పుపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ‘‘ఈ కేసులో చివరికి న్యాయం దక్కింది. ఇప్పుడు సిస్టర్ అభయ ఆత్మకు శాంతి చేకూరుతుంది” అని జోమన్ అన్నారు. ‘‘దేవుడు గొప్పోడు. ఆలస్యమైనప్పటికీ, నా సిస్టర్‌కు న్యాయం జరిగింది” అని అభయ బ్రదర్ బిజూ థామస్ అన్నారు. చర్చి, పొలిటికల్ లీడర్ల ఒత్తిడితోనే విచారణ ఆలస్యమైందన్నారు.
దొంగ సాక్ష్యమే కీలకం…
ఈ కేసులో ఒక దొంగ సాక్ష్యమే కీలకంగా మారింది. చిన్న చిన్న దొంగతనాలు చేసే రాజు.. అభయ హత్య జరిగిన రోజు అదే హాస్టల్ కు దొంగతనానికి వెళ్లాడు. ఇద్దరు ఫాదర్లు ఆ రోజు అక్కడే ఉన్నారని రాజు సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదే కేసులో కీలకంగా మారింది. సాక్ష్యం చెప్పొద్దని ఎంతోమంది తనను కలిశారని, రూ.కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని రాజు తెలిపాడు. కానీ తాను న్యాయంకోసం నిలబడ్డానని చెప్పాడు. అభయ తన బిడ్డ లాంటిదని, ఇప్పుడామెకు న్యాయం జరిగిందని చెప్పాడు. తాను అనుకున్నదే నిజమైందని సీబీఐ మాజీ డిప్యూటీ ఎస్పీ వర్గీస్ పి.థామస్ అన్నారు. కోర్టు తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎప్పటికీ నిజమే గెలుస్తుందని చెప్పారు. తాను చేసిన త్యాగానికి ఫలితం దక్కిందన్నారు. మొదట ఈ కేసును ఆయనే విచారించారు. అయితే అభయది ఆత్మహత్యేనని రిపోర్టు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తేవడంతో ఆయన వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకున్నారు.
కేసు ఏమిటంటే..
కొట్టాయంలోని బీసీఎం కాలేజీలో ఇంటర్ చదివే సిస్టర్ అభయ.. అక్కడే హాస్టల్లో ఉండేది. అదే హాస్టల్లో సిస్టర్ సెఫీ కూడా ఉండేది. 1992 మార్చి 27న తెల్లవారుజామున 4:15 గంటలకు మేల్కొన్న అభయ.. వాటర్ తాగేందుకు కిచెన్‌లోకి వెళ్లింది. అక్కడ ఫాదర్ థామస్ కొట్టూర్, ఫాదర్ పుథ్రకయాల్, సిస్టర్ సెఫీ సెక్సువల్‌గా కలిసి ఉండడాన్ని చూసింది. దీంతో తమ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడిన ఆ ముగ్గురు.. అభయపై గొడ్డలితో దాడి చేసి చంపేశారు. తర్వాత డెడ్ బాడీని బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. మొదట పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ అధికారులు విచారించి ఆత్మహత్యగా తేల్చారు. అయితే ప్రజలు ఆందోళనలు చేయడంతో 1993లో కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐ 2009లో చార్జ్ షీట్ ఫైల్ చేయగా, 11 ఏండ్ల తర్వాత తీర్పు వచ్చింది
