ప్రాపర్టీ టాక్స్ చెల్లింపుల్లో సింగరేణి నిర్లక్ష్యం

  • నస్పూర్​ మున్సిపాలిటీకి రూ.2.50 కోట్ల బకాయిలు 
  • ఓబీ కాంట్రాక్టు సంస్థలు మరో రూ.80 లక్షలు పెండింగ్​
  • నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న అధికారులు 
  • బకాయిలు పేరుకుపోవడంతో ఇబ్బందుల్లో బల్దియా 

మంచిర్యాల, వెలుగు: ఏటా వేల కోట్లలో లాభాలు ఆర్జిస్తున్న సింగరేణి సంస్థ మున్సిపాలిటీలకు ప్రాపర్టీ టాక్స్​చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. సామాన్యులు వేలల్లో బకాయిపడితే ముప్పుతిప్పలు పెట్టే మున్సిపల్​అధికారులు.. సింగరేణి కోట్లలో పెండింగ్ ఉన్నా పట్టించుకోవడం లేదు. వీరు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం.. వారు ఆ నోటీసులను లైట్​తీసుకోవడం పరిపాటిగా మారింది. ఫలితంగా నస్పూర్ మున్సిపాలిటీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. శానిటేషన్ వర్కర్లకు నెలనెలా జీతాలు చెల్లించలేని దుస్థితి నెలకొంది.

అప్పటి నిబంధనల ప్రకారం కడుతూ.. రూ.2.50 కోట్లు పెండింగ్ 

జిల్లాలోని నస్పూర్, క్యాతనపల్లి, మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీల పరిధిలోని సింగరేణి క్వార్టర్లు, ఆఫీసులు, ఇతర నిర్మాణాలకు ప్రాపర్టీ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. వాటికి పదేండ్ల క్రితం నాటి అసెస్​మెంట్​ప్రకారం మున్సిపాలిటీలు పన్నులు వసూలు చేస్తున్నాయి. ఈ పదేండ్లలో సింగరేణి అనేక కొత్త నిర్మాణాలు చేపట్టింది. పాత, కొత్త నిర్మాణాలకు చాలా తక్కువ టాక్స్​వసూలు చేస్తున్నారని సామాజిక కార్యకర్త నయీం పాషా 2021లో సీడీఎంకు ఫిర్యాదు చేశారు. దీనిపై వరంగల్​ రీజినల్ ​డైరెక్టర్​స్పందించారు. 

Also Read : విభజన సమస్యలపై ముందడుగు..రూ.861 కోట్ల లేబర్​సెస్ పంపకానికి ఓకే !

నస్పూర్, క్యాతనపల్లి, మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీల కమిషనర్లు సింగరేణికి సంబంధించిన నిర్మాణాల కొలతలు తీసుకొని ఆస్తి పన్ను మదింపు చేశారు. తద్వారా క్యాతనపల్లి మున్సిపాలిటీ పన్ను రూ.20 లక్షల నుంచి రూ.45 లక్షలకు పెంచారు. మందమర్రి మున్సిపాలిటీలో రూ.16 లక్షల నుంచి రూ.45 లక్షలు వసూలు చేస్తున్నారు. నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్న సింగరేణి నిర్మాణాలకు ప్రాపర్టీ టాక్స్​రూ.50 లక్షల నుంచి రూ.1.50 కోట్లకు చేరింది. బెల్లంపల్లిలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి మదింపు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 

క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీలకు పెరిగిన ఆస్తిపన్ను ప్రకారం సింగరేణి కంపెనీ డబ్బులు కడుతోంది. కానీ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శ్రీరాంపూర్​ జీఎం ఆఫీస్​ పెరిగిన ఆస్తిపన్ను ప్రకారం రూ.1.50 కోట్లు కట్టకుండా పాత పద్ధతిలో రూ.50 లక్షలు మాత్రమే చెల్లిస్తోంది. పెరిగిన ఆస్తి పన్ను ప్రకారం కట్టాలని నస్పూర్ మున్సిపల్ కమిషనర్ శ్రీరాంపూర్ జీఎం ఆఫీసుకు పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేదు. 2023–24 సంవత్సరానికి సంబంధించిన రూ.కోటి, 2024–25కి  రూ.1.50 కోట్లు వడ్డీతో సహా దాదాపు రూ.2.50 కోట్ల బకాయిలు ​ఉన్నాయి. ఈ మొత్తాన్ని వసూలు చేయడంలో మున్సిపల్ ​అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. 

ఓబీ ఏజెన్సీలు రూ.30 లక్షలు

సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ పరిధిలో ఉన్న శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో మట్టి తవ్వకాల పనులు చేయడానికి గౌరవ్, సీఆర్ఆర్, జీవీఆర్ ఏజెన్సీలకు కాంట్రాక్టు అప్పగించారు. ఈ ఏజెన్సీలు సింగరేణి స్థలాల్లో క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు నస్పూర్ మున్సిపాలిటీ నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదు. అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ మున్సిపల్​అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.3

 ఒక్క జీవీఆర్ కంపెనీకి నోటీసులు ఇచ్చి మిగతా రెండు ఏజెన్సీలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. కనీసం మున్సిపాలిటీకి రావాల్సిన ప్రాపర్టీ టాక్స్ అయినా వసూలు చేయాలని కోరినా పట్టించుకోవడం లేదు. గౌరవ్ ఏజెన్సీ ఏడాదికి దాదాపు రూ.10 లక్షల చొప్పున మూడేండ్లకు రూ.30 లక్షలు, సీఆర్ఆర్​ఏజెన్సీ మూడేండ్లకు దాదాపు రూ.30 లక్షలు, జీవీఆర్ రెండేండ్లకు సంబంధించి సుమారు రూ.20 లక్షలు బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. 

బకాయిలు వసూలు చేస్తే సకాలంలో జీతాలు

సింగరేణి కంపెనీ, ఓబీ ఏజెన్సీల నుంచి దాదాపు రూ.3.30 కోట్లు వసూలు చేయడంలో నిర్లక్ష్యం వల్ల నస్పూర్​ మున్సిపాలిటీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ బకాయిలను వసూలు చేసినట్లయితే శానిటేషన్​ వర్కర్లకు సకాలంలో జీతాలు చెల్లించవచ్చు. ఈపీఎఫ్, ఈఎస్ఐ కిస్తీలు ఎప్పటికప్పుడు కట్టవచ్చు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డ్రైనేజీలు, రోడ్ల పనులు, ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. 

అయినా మున్సిపల్​అధికారులు పట్టించుకోకపోవడంపై పలువురు మండిపడుతున్నారు. సామాన్యులు వేలల్లో బకాయిలుంటే ముప్పుతిప్పులు పెట్టి వసూలు చేసే అధికారులు.. సింగరేణి విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్​ స్పందించి బకాయిల వసూళ్ల కోసం తగిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త నయీం పాషా కోరారు.