విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్​పై సైలెన్స్

  • ప్రభుత్వానికి నెలన్నర కింద నివేదిక ఇచ్చిన కమిషన్​.. యాక్షన్​ ఎప్పుడున్న దానిపై చర్చ
  • గత బీఆర్​ఎస్​ పాలనలో విద్యుత్ కొనుగోళ్లు, 
  • ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలు
  • నిగ్గు తేల్చేందుకు మార్చి 14న జ్యుడీషియల్​ కమిషన్​ వేసిన ప్రభుత్వం
  • విద్యుత్​ సంస్థల సీఎండీలు సహా 
  • మొత్తం 28 మందిని విచారించిన కమిషన్​
  • తమ వాదనలు వినిపించిన విద్యుత్​ రంగ నిపుణులు
  • వంద పేజీలతో అక్టోబర్​ 28న కమిషన్​ నివేదిక

హైదరాబాద్​, వెలుగు: గత బీఆర్​ఎస్​ సర్కార్​ హయాంలో జరిగిన విద్యుత్​ కొనుగోళ్లపై జ్యుడీషియల్​ కమిషన్​ రిపోర్ట్​ ఇచ్చి నెలన్నర అవుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్​గా ఉండడంపై చర్చ జరుగుతున్నది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నా.. ఇప్పటి వరకు ఆ దిశగానూ ఎలాంటి ప్రయత్నం జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

గత సర్కారు హయాంలో చత్తీస్​గఢ్​ విద్యుత్​ కొనుగోలు ఒప్పందాలు,  కాలంచెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి పవర్​ ప్లాంట్​నిర్మాణం, నామినేషన్​పై పనుల కేటాయింపు తదితర అంశాల్లో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్​ ప్రభుత్వం.. కమిషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఎంక్వైరీస్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌ -1952 ప్రకారం మొదట జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఎల్‌‌‌‌‌‌‌‌. నరసింహారెడ్డి అధ్యక్షతన ఏకసభ్య కమిషన్‌‌‌‌‌‌‌‌ను 2024 మార్చి 14న నియమించింది. అనంతరం కోర్టు ఆదేశాలతో జస్టిస్​ నరసింహారెడ్డి స్థానంలో బాధ్యతలను జస్టిస్​ లోకూర్​ కమిషన్​కు అప్పగించింది.

మొత్తంగా 8 నెలలపాటు సమగ్ర దర్యాప్తు చేపట్టిన కమిషన్​ పలు అక్రమాలు జరిగినట్లు తేల్చింది. అక్టోబర్​ 28న ప్రభుత్వానికి కమిషన్​ తన రిపోర్టును అందజేసింది. ప్రభుత్వానికి నివేదిక వచ్చి 47 రోజులు అవుతున్నా.. ఎలాంటి యాక్షన్​ కనిపించడం లేదు. అసలు చర్యలు ఉంటాయా? లేదా అన్న టాక్​ పొలిటికల్​ సర్కిల్స్​లో వినిపిస్తున్నది. 

చత్తీస్​గఢ్​ ఒప్పందంతో వేలకోట్ల భారం

చత్తీస్​గఢ్​ కరెంట్​ను యూనిట్​ రూ.3.90 పెట్టి కొన్నామని సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్​ పదే పదే చెప్పారు. కానీ, దీంతోపాటు అన్​ యూజ్డ్​​ కారిడార్​, మార్కెట్​ పర్చేజ్​, పెనాల్టీలు ఇతరత్రా కలిపి యూనిట్​కు రూ.5.50 నుంచి 6 దాకా పడింది.  అప్పుడున్న పరిస్థితుల్లో కాంపిటేటివ్​ బిడ్డింగ్​ పెడితే  మన రాష్ట్ర సరిహద్దుల వరకు రూ. 4కు యూనిట్​ వచ్చే  పరిస్థితి ఉండేదని ఎక్స్​పర్ట్స్​చెప్తున్నారు. కానీ, గత సర్కారు ఇలా చేయకుండా నేరుగా చత్తీస్​గఢ్​ విద్యుత్​ ఉత్పత్తి సంస్థతో తెలంగాణ విద్యుత్​ పంపిణీ సంస్థ సదరన్​ డిస్కం వెయ్యి మెగావాట్ల కరెంట్​ కొనుగోలుకు అగ్రిమెంట్​చేసుకుంది.

మొదటి ఐదేండ్లలో చత్తీస్​గఢ్​ 500  మెగావాట్లలోపే కరెంట్​ సరఫరా చేసింది. అంటే అగ్రిమెంట్​లో కనీసం 50 శాతం కూడా సప్లయ్​ చేయలేదు. చివరి దశలో 200 నుంచి 300 మెగావాట్ల కరెంట్​ మాత్రమే సరఫరా అయింది. ఆ తర్వాత  అది కూడా చేయలేదు. దీంతో తెలంగాణకు అనేక సమస్యలు వచ్చాయి. సరైన ప్లానింగ్​ లేక షెడ్యూలింగ్​లో విద్యుత్​ సంస్థలు సమస్యలు  ఎదుర్కొన్నాయి. ముందస్తు ఒప్పందాలు లేకపోవడంతో ఇతర విద్యుత్​ సంస్థల నుంచి , పవర్​ ఎక్సేంజ్​ నుంచి అధిక రేట్లకు కరెంట్​కొనాల్సి వచ్చింది. దీంతో ఏటా వేల కోట్ల అదనపు భారం పడింది.

ఇట్ల ప్రత్యామ్నాయ విద్యుత్​ కొనుగోళ్ల కారణంగా రూ.2,600 కోట్ల నష్టం జరిగింది.  ఇదీగాక పీజీసీఎల్​తో కారిడార్​ ఒప్పందం చేసుకున్నప్పటికీ  కరెంటు తీసుకోకపోవడం వల్ల రూ. 635 కోట్ల నష్టం వచ్చింది. ఇట్ల చత్తీస్​గఢ్​ఒప్పందం కారణంగా మూడు రకాల నష్టాలు జరిగినట్లు విచారణలో విద్యుత్​ కమిషన్​ గుర్తించింది. ఇరు రాష్ట్రాల డిస్కంలు మాత్రమే ఎంవోయూ చేసుకున్నాయని.. చత్తీస్​గఢ్ ఒప్పందం రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం పొందలేదనేది కూడా కమిషన్​ దృష్టికి వచ్చినట్లు తెలిసింది.  

గుదిబండగా యాదాద్రి పవర్​ ప్లాంట్

4 వేల మెగావాట్ల కెపాసిటీ గల యాదాద్రి థర్మల్​​పవర్​ ప్లాంట్​ను బొగ్గు నిల్వలు కేటాయించిన మణుగూరుకు వందల కిలోమీటర్ల దూరంలోని దామరచర్లలో ఏర్పాటు చేయడం వల్ల రవాణా ఖర్చు అధికమవుతున్నది.  రవాణా చార్జీల రూపంలో ఏటా రూ.1,600 కోట్లకు పైగా నష్టం జరగనుంది. ఇక ఈ ప్లాంట్​ నిర్మాణంలో సివిల్​ వర్క్స్​ను​ నామినేషన్ పై నాడు బీఆర్​ఎస్​ నేతలకు కేటాయించారనే ఆరోపణలు వచ్చాయి. కాంపిటేటివ్ బిడ్డింగ్​కు పోకపోవడం వల్ల భారీ నష్టం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ ప్లాంట్​నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో పాటు ఉత్పత్తి వ్యయం కూడా పెరుగుతున్నది. ఇప్పటికే విద్యుత్​ ఉత్పత్తి వ్యయం యూనిట్​కు రూ.6 నుంచి 6.60 దాటింది. 50 శాతం దేశీయ బొగ్గు, 50 శాతం విదేశీ బొగ్గును వాడాల్సి ఉండగా.. గత ప్రభుత్వం దేశీయ బొగ్గును వాడడంతో నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​ క్లియరెన్స్​ ఇవ్వలేదు. అంతేకాదు క్లియరెన్స్​లు రాక , సరైన టైమ్​లో అప్పులు పుట్టక తీవ్ర జాప్యం జరిగింది.

అదనంగా నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. 2015లో శంకుస్థాపన జరిగితే 2020 అక్టోబర్​ నాటికి 2 యూనిట్లు, 2021 నాటికి మూడు యూనిట్లు  పూర్తి కావాల్సి ఉండగా సకాలంలో పనులు కాక వేల కోట్ల ఆర్థిక భారం పెరిగింది. ఇలా గత సర్కారు చేపట్టిన భద్రాద్రి, యాదాద్రి రెండు పవర్​ ప్లాంట్లు ప్రభుత్వానికి తెల్ల ఏనుగుల్లా  మారాయని విద్యుత్​ ఎంక్వైరీ​ కమిషన్​ గుర్తించింది. 

8 నెలల్లో అందిన రిపోర్ట్​

విద్యుత్​ కొనుగోళ్లపై దమ్ముంటే విచారణ జరిపించండంటూ బీఆర్​ఎస్​ నేతలు విసిరిన సవాల్​ను స్వీకరించిన కాంగ్రెస్​ ప్రభుత్వం 2024 మార్చి 14న జ్యుడీషియల్​ కమిషన్​ను వేసింది. హైకోర్టు మాజీ చీఫ్​ జస్టిస్​ నరసింహారెడ్డికి కమిషన్​ బాధ్యతలు అప్పగించింది. వెంటనే పని ప్రారంభించిన కమిషన్​.. విద్యుత్​ ఒప్పందాల్లో కీలకంగా వ్యవహరించిన బీఆర్​ఎస్​ హయాంలోని ఎనర్జీ సెక్రటరీలు, విద్యుత్​ సంస్థల సీఎండీలు సహా మొత్తం 28 మంది విద్యుత్ అధికారులను విచారించింది. విద్యుత్​ రంగ నిపుణుడు రఘు,   వేణుగోపాల్​రావు, తిమ్మారెడ్డి, టీజేఎస్​ చీఫ్  కోదండరాం,  జెన్​కో మాజీ అధికారి సహా పలువురి నుంచి వివరాలను తీసుకుంది.

విద్యుత్​కొనుగోలు ఒప్పందాలు.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్​ప్లాంట్ల ఏర్పాటు నిర్ణయాల్లో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పాత్ర ఉందని ప్రాథమికంగా నిర్ధారించిన కమిషన్.. ​ కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు నోటీసులు ఇచ్చింది.  కాగా, విచారణ తుదిశలో ఉండగా సుప్రీంకోర్టు ఆదేశాలతో కమిషన్​ నుంచి జస్టిస్​ నరసింహారెడ్డి తప్పుకోవడంతో ఆయన స్థానంలో జులై 29 జస్టిస్​ మదన్​ మోహన్​ బీంరావు లోకూర్​కు కమిషన్​ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

అప్పటికే ఎంక్వైరీలన్నీ పూర్తయినందున జస్టిస్​లోకూర్​ కమిషన్​ ఆ రిపోర్టులన్నింటినీ మూడు నెలల పాటు సమగ్రంగా అధ్యయం చేసి అక్టోబర్​ 28న వంద పేజీలకు పైగా నివేదికను  ఎనర్జీ సెక్రటరీ సందీప్​కుమార్​ సుల్తానియాకు అందించారు.  ప్రధానంగా చత్తీస్​గఢ్ తో విద్యుత్​​ఒప్పందాలకు సంబంధించి ఆరు అంశాల్లో నిబంధనలను గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం బేఖాతరు చేసినట్లు కమిషన్​ గుర్తించింది.  ఫలితంగా పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది.

అదేవిధంగా భద్రాద్రి ప్లాంట్​కు కాలం చెల్లిన సబ్​క్రిటికల్​ టెక్నాలజీ వాడడం, బొగ్గుగనులకు దూరంగా యాదాద్రి ప్లాంట్​ను నిర్మాణం చేపట్టడం వల్ల ఈ రెండు ప్లాంట్లు సర్కారుకు గుదిబండగా మారనున్నాయని తెలిపినట్లు సమాచారం. ఈ రెండు పాంట్ల నిర్మాణాల్లో నామినేషన్​పై పనులు అప్పగించడం వల్ల భారీ అక్రమాలు  జరిగినట్లు నివేదికలో కమిషన్​ పేర్కొన్నట్లు తెలిసింది. కాగా, ఈ నివేదిక సర్కారు చేతికి వచ్చి నెలన్నర కావస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి చర్యలు కనిపించకపోవడం పొలిటికల్​ సర్కిల్స్​లో  చర్చకు దారితీసింది.  

కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్​

నాటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం బీహెచ్​ఈఎల్ నుంచి కాలంచెల్లిన 270 మెగావాట్ల కెపాసిటీ గల నాలుగు బాయిలర్లను కొని 1080 మెగావాట్ల కెపాసిటీతో సబ్​క్రిటికల్​ విధానంలో భద్రాద్రి పవర్​ ప్లాంట్​ నిర్మాణం చేపట్టింది. గ్లోబల్​ టెండర్లకు పోకుండా ఇండియా బుల్స్​ అనే ప్రైవేట్​ కంపెనీ ఆర్డర్​ పెట్టి తీసుకోకుండా,  బీహెచ్​ఈఎల్​ నుంచి సేకరించింది. వాస్తవానికి 2010లో తయారు చేసుకున్న సబ్​ క్రిటికల్​ టెక్నాలజీ టర్బెన్లు, బాయిలర్లను, యంత్రాలను ఆరేండ్ల తర్వాత ప్రభుత్వంపై బీహెచ్ఈఎల్ బలవంతంగా రుద్దిందన్న విమర్శలు ఉన్నాయి.

ఈ నిర్ణయం కారణంగా ఎలాంటి ప్రయోజనం లేక పోగా జెన్​కోకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాలం చెల్లిన సబ్​ క్రిటికల్​ విధానాన్ని వాడడంపై ఆరోపణలు వచ్చాయి. దేశంలోని అన్ని ప్లాంట్లతో పోల్చినప్పుడు భద్రాద్రి ప్లాంట్​లో బొగ్గు వినియోగం ఎక్కువ. దీంతో యూనిట్​ ఉత్పత్తి  సగటున రూ.6.03 ఖర్చు అవుతుందని జెన్​కో అంచనా వేసింది. అదే భూపాలపల్లిలోని  కేటీపీపీలో సగటు ఉత్పత్తి వ్యయం  రూ.4.89 మాత్రమే. భద్రాద్రి ప్లాంట్​ ద్వారా రాబోయే 25 ఏండ్లలో రూ.9వేల కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉందని విద్యుత్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు