Sikandar Raza: శివాలెత్తిన సికందరుడు.. 33 బంతుల్లోనే శతకం

జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పురుషుల టీ20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌లో భాగంగా గాంబియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో సికందర్ రజా.. 33 బంతుల్లోనే వంద మార్క్ చేరుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో జింబాబ్వే జట్టును ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చోబెట్టాడు. 

సికందరుడి విధ్వంసానికి గాంబియా బౌలర్ల వద్ద సమాధానమే లేకపోయింది. పసికూన గాంబియా బౌలర్లు, ఫీల్డర్లు ప్రేక్షక పాత్ర వహించారు. మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న ఈ జింబాబ్వే కెప్టెన్ 15 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 133 పరుగులు చేశాడు. దాంతో, జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు.

టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ

ఈ ఇన్నింగ్స్‌తో సికందర్ రజా అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఐసీసీ పూర్తి సభ్య దేశానికి చెందిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో 2017లో రోహిత్, మిల్లర్ ఇద్దరూ 35 బంతుల్లో సెంచరీలు నమోదు చేశారు.

అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు(ఐసీసీ పూర్తి సభ్య దేశాలు)

  • సికందర్ రజా: 33 బంతుల్లో vs నమీబియా (2024)
  • రోహిత్ శర్మ: 35 బంతుల్లో vs శ్రీలంక (2017)
  • డేవిడ్ మిల్లర్: 35 బంతుల్లో vs బంగ్లాదేశ్ (2017)
  • జాన్సన్ చార్లెస్: 39 బంతుల్లో vs దక్షిణాఫ్రికా (2023)
  • సంజు శాంసన్: 40 బంతుల్లో vs బంగ్లాదేశ్ (2024)