ఏరువాక పౌర్ణమి అంటే ఏమిటి? ఆరోజే ఎందుకు పొలం ప్రారంభించాలో తెలుసా....

ఏరువాక పున్నమి రోజు ( జూన్​ 21) పశువులను పూజించి.. రైతులు పొలం పనులు ప్రారంభించాలని  పురాణాల్లో రుషి పుంగవులు పేర్కొన్నారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజున.. ఎడ్లకు.. నాగలి.. ఇతర వ్యవసాయ పనిముట్లకు పూజలు చేస్తారు. ఆ తరువాత రైతులు తమ పొలంలో భూమి పూజ కూడా చేస్తారు.  ఆరో జే ఎందుకు వ్యవసాయ పనులు ప్రారంభించాలి..శాస్త్రాల్లో ఏముందో తెలుసుకుందాం. . .

తొలకరి పిలుపు రైతన్న మోములో చిరునవ్వు, పిల్ల కాలువల గెంతులాట, పుడమితల్లి పులకరింతకు సాక్ష్యమే ఏరువాక పౌర్ణమి. ఆధునికత ఎంత ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠ మాసం మొదలైన తర్వాత వర్షాలు కురవడం మొదలవుతాయి. జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడి భూమి మెత్తబడుతుంది. దుక్కి దున్నడం, వ్యవసాయ పనులను ప్రారంభించడం ఏరువాకతోనే ప్రారంభమవుతుంది.

ఏరువాక పౌర్ణమి.. జ్యేష్ఠ పౌర్ణమి రోజు... ( June 21) భూమిని, పశువులను, సేద్యానికి అవసరమైన పనిముట్లను పూజించే పండగ ఇది. ప్రకృతిని పూజించే పండగే ఏరువాక పున్నమి. అయితే జ్యేష్ట మాసంలో భూమిని ఎక్కువగా తవ్వకూడదని చెబుతారు. భూమి వేడెక్కి ఉన్నప్పుడు తవ్వడం వల్ల అందులో నుంచి విష వాయువులు వెలువడతాయని నమ్మకం. కేవలం పూజ కోసం మాత్రమే కాసింత దున్నుతారు. వర్షం పడగానే తిరిగి సేద్యపు పనులు ప్రారంభిస్తారు. ఏరువాక పౌర్ణమి రోజున పశువులకు స్నానం చేయిస్తారు. వాటి గిట్లకు పూజ చేస్తారు. గోమాతకు పూజ చేస్తారు. నాగళ్లను దున్నేందుకు కష్టపెడుతున్నందున క్షమించి కరుణించమని అన్నదాత వాటికి పూజ చేస్తాడు. ఆహారం పండించేందుకు సహకరించాలని కోరుతాడు.

అన్నదాతలు వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి. ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు జరుపుకునే వేడుక. ఏరు అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం చేయడం అని అర్థం. ఏరువాక పౌర్ణమి రోజు రైతులు పొద్దున్నే నిదుర లేచి ఎడ్లకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు పసుపు, కుంకుమ కొంతమంది అయితే రంగులు కూడా పూస్తారు, అలాగే వాటికి చక్కగా గజ్జెలు, గంటలు కట్టి వాటిని కట్టేసే తాడుని ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు.ఇక ఎద్దులకు కూడా భక్తి శ్రద్ధలతో బొట్టు పెట్టి పూజలు చేసి వాటికి బొబ్బట్లు తినిపిస్తారు

బెల్లం, బియ్యం, ఆవుపాలతో పులగం వండి పశువులకు ఆహారంగా పెడతారు. రైతులు ఏరువాక పున్నమి పాటలు పాడుకుంటారు.అలాగే సేద్యానికి అవసరమైన పరికరాలన్నింటికీ పూజ చేస్తారు. నాగలి, కర్రు, గొర్రు, పార, ఆకురాయి వంటి వాటికి పూజ చేస్తారు.  అలాగే పొలాలకు వెళ్ళి భూదేవికి పూజలు చేసి పంటలు బాగా పండేలా దీవించమని ప్రార్థిస్తారు, ఎద్దులకు రంగులద్ది రకరకాల బట్టలతో అలంకరిస్తారు. మేళ తాళాలు డప్పు వాయిద్యాల నడుమ వాటిని ఊరంతా ఊరేగిస్తారు, అంటే ఓ చిన్న సైజు హోళి పండుగే కనిపిస్తుంది.

 ఎద్దులు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, రోగాల బారిన పడకుండా ఉండేందుకు అధర్వణ వేదం లో చెప్పబడిన మందులను , నూనెలను తాగిస్తారు. అలాగే నాగలి తో పాటు అన్ని వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లకు పసుపు కుంకుమ రాసి పొంగళి నైవేద్యం సమర్పిస్తారు.

ఇంకో వైపు సస్యానికి ఓషధులకు అధిపతి చంద్రుడు. వర్ష ఋతువు మొదలయ్యక జ్యేష్టా నక్షత్రం లో తన నిండైన రూపంతో చందమామ కూడేది పౌర్ణమి రోజే, దేశం సుభిక్షంగా ఉండాలి అంటే కరువు కాటకాలు లేకుండా వర్షాలు సమృద్ధిగా పాడి పంటలు చక్కగా పండాలి, దానికి నాంది పడేదే ఏరువాక పౌర్ణమి రోజు. రైతే రాజు అని కీర్తించే మన దేశం లో రైతు సంతోషంగా ఉంటే... మనం కూడా సంతోషంగా ఉంటాం...