ఆధ్యాత్మికం: ప్రతిరోజు దీపారాధన ఎందుకు చేయాలి... వెలిగించేటప్పుడు ఏ మంత్రం చదవాలి..

హిందువులు రోజు పొద్దున్నే దేవుడి దగ్గర దీపారాధన చేసి దండం పెట్టుకొని వారి పనులు మొదలు పెడతారు.  ఇది ఎప్పటినుంచో  వస్తున్న ఆచారం.  దీపారాధన కుందిలో నూనె, ఒత్తులు వేసి వెలిగించి.. తనకున్న బాధలను.. కొర్కెలను తీర్చమని దండం పెట్టుకుంటారు.  అసలు దీపారాధన ఎందుకు చేయాలి.. అందులో ఉన్న విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. . .

హిందువులు చాలామంది ఇంట్లో దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటారు.  ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత దేవుడి మందిరం దగ్గర దీపారాధన చేస్తారు.  కొంతమంది  ఈ దీపాన్ని ఉదయము, మరి కొందరు సాయంత్రం, ఇంకొందరు ఉభయ సంధ్యలలో  వెలిగిస్తారు. అరుదుగా కొందరు (అఖండ దీపము) ప్రతి దినము రోజంతా ఉండేలాగ దీపాన్ని వెలిగిస్తారు. శుభ సందర్భాలు, నిత్య పూజలు, ప్రార్ధనలు, పర్వ దినాలు మరియు సామాజిక ప్రారంభోత్సవాలు మొదలైనవి అన్నీ కూడా దీపము వెలిగించిన తర్వాతనే ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి ఆయా సందర్భాలు పూర్తయ్యేవరకు ఆ దీపాన్ని అలాగే కొనసాగిస్తారు. 

అలా ఎందుకు చెయ్యాలి?

కాంతి జ్ఞానానికి, చీకటి అజ్ఞానానికి...  చిహ్నాలు. భగవంతుడు జ్ఞానస్వరూపుడు. .. అన్ని విధాలైన జ్ఞానానికీ ఆయనే ఆధారం. జ్ఞానాన్ని ఇచ్చేవాడు...  పోషించే వాడు కనుక జ్యోతి రూపములో భగవంతుడిని ఆరాధిస్తాము. కాంతి చీకటిని తొలగించినట్లుగా.... జ్ఞానము ... అజ్ఞానాన్ని తొలగిస్తుంది. జ్ఞానమనేది ఎప్పటికీ తరగని అంతరంగ సంపద. అన్ని సంపదలకన్నా గొప్ప సంపదగా జ్ఞానాన్ని భావించి దీపాన్ని వెలిగించి నమస్కరిస్తాము.  మనము చేసే పనులు మంచివైనా, చెడ్డవైనా జ్ఞానాన్ని ఆధారముగా చేసికొనే చేస్తాము. అందువలననే అన్ని శుభ సందర్భాలలో మన ఆలోచనలకు సాక్షిగా దీపాన్ని వెలిగిస్తాము. 

బల్బును కానీ ట్యూబ్ లైట్​ను  గానీ ఎందుకు వెలిగించరు? అది కూడా చీకట్లను తొలగిస్తుంది కదా అంటే ..  సాంప్రదాయ దీప కాంతి మనకు ఆధ్యాత్మికమైన ప్రాముఖ్యతను కూడా సూచిస్తుంది. దీపానికి వాడే నెయ్యి లేక తైలము మనలోని వాసనలు లేక స్వార్ధ పూరితమైన సంస్కారాలకు చిహ్నము. పత్తితో తయారు చేసిన వత్తి అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానముతో వెలిగిస్తామో అప్పుడు వాసనలు మెల్లగా కరిగి పోయి అహంకారం అంతరించిపోతుందని పండితులు చెబుతున్నారు.. .  

ALSO READ : ఆధ్యాత్మికం: శ్రీరాముడు మరణించే సమయంలో.. ఆంజనేయస్వామి ఎక్కడ ఉన్నాడో తెలుసా..

జ్యోతి ఎప్పుడూ పై వైపుకు మాత్రమే చూస్తూ ఉంటుంది. అదే విధముగా మనము ఆర్జించే జ్ఞానము మనల్ని ఎప్పుడూ ఉన్నత ఆశయాల వైపు మళ్ళిస్తుంది. ఒక దీపము కొన్ని వందల దీపాలను వెలిగిస్తుంది. అదే విధముగా ఒక జ్ఞాని ... తన జ్ఞానాన్ని ఎంతో మందికి అందిస్తాడు. దీపాలను వెలిగించడము వలన .. వెలిగించే దీపము  కాంతి ఏమాత్రము తగ్గి పోదు. అదే విధముగా జ్ఞాని ... జ్ఞానాన్ని ఇతరులకి పంచడము వలన తన జ్ఞానము తగ్గదు. పైపెచ్చు జ్ఞానము గురించిన అవగాహన పెంపొందుతుంది. ఇచ్చిన వాళ్లకు, తీసికొనే వాళ్లకు కూడా ఉపయోగకారి అవుతుంది. దీపం వెలిగించే టప్పుడు ఈ క్రింది ప్రార్ధన చేస్తాము. 

దీపం జ్యోతీ పరబ్రహ్మ దీపం స్సర్వం తమోపహః 
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే

అజ్ఞానాన్ని హరించి, జ్ఞానాన్ని ఇచ్చి అన్నింటిని సిద్ధింప చేసికొనే శక్తినిచ్చే సంధ్యా దీపాన్ని నిత్యం చేస్తూ ఉండాలి . ఈ ఆచారము జ్ఞాన సంపద, ఆధ్యాత్మిక సంపదను సూచిస్తుంది.