Christmas 2024 : మెదక్ కంటే పెద్ద చర్చి.. మన తెలంగాణలోనే మరొకటి ఉంది తెలుసా..!

మెదక్ చర్చి తర్వాత దేశంలో అంతటి ప్రత్యేకత డోర్నకల్  సీఎస్ఐకి ఉంది.  ఇది మహబూబాబాద్ జిల్లాలో ఉంది. దీని నిర్మాణం 1939లో పూర్తైంది. 1910లో ఈడెన్ బర్గ్ లో  జరిగిన ఒక సమావేశంలో ఒలంపియా డయాసేషన్ ఏర్పాటు అయ్యింది. అదే సంవత్సరం భారతదేశంలో నిజాం రాజ్యంలో డయాసిషన్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే నిజాం రాజ్యంలో చర్చిని కట్టించారు. అదే డోర్నకల్ సిఎస్ఐ. దీన్ని ఇక్కడ కట్టించడానికి బిషప్ దేవనాయగం సామ్యూల్ అజరయ్య ఎంతో కృషి చేశారు. 1915, జనవరి 14వ ఎఫిఫని కేథడ్రల్ పేరిట ఈ చర్చి నిర్మాణం మొదలైంది. అప్పటి మద్రాసు 5వ బిషప్ హెన్రీవైట్ దీనికి శంఖుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తి కావడానికి 24 సంవత్సరాలు పట్టింది. 1939 జనవరి 6న ఈ చర్చిలో క్రీస్తును స్తుతిస్తూ తొలి ప్రార్థన చేశారు.

ఎన్నో ప్రత్యేకతలు

హిందూ, ముస్లిం, క్రైస్తవ సంప్రదాయాల కలయికతో ఈ చర్చిని కట్టడం విశేషం. లోపలికి వెళ్లగానే తెల్లని చలువరాతి బండలు పాదాలను తాకుతాయి. శిలలా కనిపించే రెండు మండప తోరణాలపై ఎఫిఫనీ నక్షత్రం, పద్మాలు వాటిపై రెండు కలువలు ఉన్నాయి. హిందూ సంప్రదాయంలో స్వాగతం పలుకుతున్నట్లుగా చర్చి ద్వారం ఉంటుంది. చర్చి ముఖద్వారంలో ఉన్నరెండు పెద్ద తలుపులపై మేలిమి ఇత్తడితో చేసిన గోపురాకృతులు, పిడులు అమర్చడంతో అచ్చం  హిందూ దేవాలయ ప్రధాన ముఖద్వారంలో కనిపిస్తుంది. చర్చిపై రెండు వైపులా ఉన్న మినార్లు మసీద్ గోపురాల్లా ఉంటాయి. విశాలమైన భవనంలో తెల్లటి రాతి స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలో చెక్కిన అరటి  మొగ్గ సన్మార్గానికి...  ఉమ్మెత్త పువ్వు పాప వినాశనానికి సూచిక అని చరిత్రకారులు చెప్తున్నారు

ALSO READ : డిసెంబర్ 21 ఆకాశంలో అద్భుతం... పగలు 8 గంటలు.. రాత్రి 16 గంటలు.. అదెలాగంటే..


1906 అక్టోబర్ 6న మద్రాసు బిషప్ హెన్రీవైట్ డోర్నకల్ వచ్చి 15మంది మగవాళ్లు, 18 మంది ఆడవాళ్లకు బాప్టిజం ఇచ్చాడు. 1909లో వేదనాయకం సామ్యూల్ అజరయ్యే ప్రధమ మిషనరీగా వచ్చారు. డయాసిషన్ ఏర్పాటు తర్వాత 1912లో డోర్నకల్ మొదటి బిషప్ గా  బాధ్యతలు తీసుకున్నాడు. కర్నూలు, పశ్చిమ గోదావరి, దుమ్ముగూడెం, కృష్ణ, నల్గొండ తదితర ప్రాంతాల్లోని క్రైస్తవ మిషనరీలను కలుపుతూ 1920లో ఎఫిఫస్ కోఫల్ సీనాథ్ ఏర్పాటు అయ్యింది. అప్పుడు ఈ ఫినాడ్ లో 8వేల మంది ఉద్యోగులు, సంఘస్తులు ఉండేవాళ్లు.  డోర్నకల్ చర్చి ఈ ఫినాడ్ లో భాగంగా ఉండేది. . ఇక్కడ ప్రతి రోజు ప్రార్థనలు, గీతాలాపనలు చేస్తుంటారు. 600 పైగా చర్చలు కలిగిన ఈ అధ్యక్ష మండలంలో బధిర పాఠశాలలు, కళాశాలలతో పాటు ఎప్పుడూ సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి.ఇక్కడ  క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు చర్చి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు దేశ విదేశాల్లోని క్రైస్తవులతో పాటు వివిధవర్గాల ప్రజలు వచ్చి ఏసు సందేశంవింటారు. 

-వెలుగు,లైఫ్-