కాంగ్రెస్‌‌‌‌వి డైవర్షన్‌‌‌‌ పాలిటిక్స్‌‌‌‌ : హరీశ్‌‌‌‌రావు

  •    మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు
  •     ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మల్లన్నసాగర్‌‌‌‌ సందర్శన

సిద్దిపేట/తొగుట, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ కూలిపోయిందంటూ కాంగ్రెస్‌‌‌‌ డైవర్షన్‌‌‌‌ పాలిటిక్స్‌‌‌‌ చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు విమర్శించారు. తొగుట మండలం తుక్కాపూర్ వద్ద మల్లన్న సాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి శుక్రవారం హరీశ్‌‌‌‌రావు సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు వృథా చేశారని కాంగ్రెస్‌‌‌‌ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజక్టే లేకపోతే మల్లన్నసాగర్‌‌‌‌కు 21 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చేవని ప్రశ్నించారు. 

ఈ నీళ్లతో మెదక్, యాదాద్రి, సిద్దిపేట జిల్లాల్లో పొలాలు తడుస్తున్నాయని చెప్పారు. దండం పెట్టుకోవడానికి వస్తే కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిచడం దుర్మార్గం అన్నారు. మల్లన్న సాగర్‌‌‌‌ కింద మిగిలిన కాల్వల పనులను త్వరగాపూర్తి చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌‌‌‌రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు వెంకటరాంరెడ్డి, దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి పాల్గొన్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు మల్లన్నసాగర్‌‌‌‌ సందర్శన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలతో పాటు కొద్దిమందిని మాత్రమే మల్లన్నసాగర్‌‌‌‌ కట్టపైకి అనుమతించారు. ఈ సందర్భంగా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు, గజ్వేల్‌‌‌‌ ఏసీపీ పురుషోత్తంరెడ్డి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.

‘హరీశ్‌‌‌‌ గో బ్యాక్‌‌‌‌’ అంటూ  కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు, ప్రజల నిరసన

మల్లన్న సాగర్‌‌‌‌ సందర్శనకు వచ్చిన హరీశ్‌‌‌‌రావు, ఎమ్మెల్యేలు గో బ్యాక్‌‌‌‌ అంటూ కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు తుక్కాపూర్‌‌‌‌ ప్రజలతో కలిసి నిరసన తెలిపారు. నిర్వాసితులకు సరైన న్యాయం చేయలేని వారు ఇక్కడికి ఎలా వస్తారంటూ ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌‌‌‌ లీడర్లతో పాటు మహిళలు, ప్రజలు కట్టపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న గజ్వేల్‌‌‌‌ ఏసీపీ పురుషోత్తంరెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని కాంగ్రెస్‌‌‌‌ లీడర్లకు నచ్చజెప్పడంతో వారు నిరసన విరమించి వెళ్లిపోయారు. నిరసనలో నాయకులు చెరుకు విజయ్‌‌‌‌రెడ్డి, గాంధారి నరేందర్‌‌‌‌రెడ్డి, మండల అధ్యక్షుడు అక్కం స్వామి ఉన్నారు.