సిద్దిపేట ఆర్టీసీ డిపోకు అవార్డు

సిద్దిపేట టౌన్, వెలుగు : రాష్ట్రస్థాయి ఆర్టీసీ ఉత్తమ సేవల్లో సిద్దిపేట డిపో కు తృతీయ స్థానం రావడం సంతోషంగా ఉందని ఉమ్మడి మెదక్ జిల్లా రీజినల్ మేనేజర్ ప్రభులత అన్నారు. శుక్రవారం సిద్దిపేట ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన అభినందన సభలో డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి తో కలిసి పాల్గొని మాట్లాడారు. మహాలక్ష్మి పథకం రద్దీని తట్టుకుని అవార్డు సాధించడం మామూలు విషయం కాదన్నారు. 

తృతీయ బహుమతిగా రూ.2లక్షలు పొందడంపై ఉద్యోగులు, సిబ్బందిని అభినందించారు. ప్రతీనెల ఇచ్చే ప్రగతిచక్రం అవార్డులు ప్రతీ ఉద్యోగి తీసుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆర్టీసీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణించి లక్కీడిప్ ద్వారా ఎంపికైన ముగ్గురు ప్రయాణికులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ మహేశ్వరీ, దుబ్బాక ఆర్టీసీ డిపో ఇన్​చార్జి కనకలక్ష్మి, సిబ్బంది మౌలానా, నాగేందర్ పాల్గొన్నారు.