కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, మరో వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. వీళ్లు ముగ్గురూ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకు బలమైన కారణం ఉండొచ్చని భావిస్తున్నారు. ముగ్గురి ఆత్మహత్యకు కారణం ఏంటన్నది ఇంకా మిస్టరీగానే ఉంది.
పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎస్ఐ సాతెల్లి సాయికుమార్( 31), బీబీపేట పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శృతి (28), బీబీపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న తోట నిఖిల్(28).. సదాశివనగర్మండలం అడ్లూర్ఎల్లారెడ్డి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
ఆత్మహత్య రోజు అసలేం జరిగిందంటే..?
కానిస్టేబుల్శృతి బుధవారం పొద్దున డ్యూటీ కంప్లీట్ అయిన తర్వాత తన సొంతూరు గాంధారికి వస్తున్నట్టు ఫోన్లో తల్లి విజయకు చెప్పింది. కొద్ది సేపటికి ఫోన్‌చేస్తే తాను సగం దూరం వచ్చానని, కానీ డ్యూటీ ఉందని మళ్లీ స్టేషన్‌కు రమ్మంటున్నారని తెలిపింది. మధ్యాహ్నం తర్వాత ఫోన్‌చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఎస్సై సాయికుమార్ బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తన సొంత కారులో క్వార్టర్ నుంచి బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నాననేది ఎవరికీ చెప్పలేదు. వెళ్లేటప్పుడు తాళం కూడా వేయలేదని తెలిసింది.
ఆయన నాలుగు రోజుల క్రితమే భార్య లక్ష్మీని ఇంటి దగ్గర దింపి వచ్చారు. బుధవారం పొద్దున కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడినప్పుడు ఇంటికి వస్తానని చెప్పారు.ఇక నిఖిల్ 11 గంటల వరకు బీబీపేటలోనే ఉన్నాడు. ఇంట్లో తిని బయటకు వెళ్లాడని తల్లి స్వరూప తెలిపింది. కాగా, శృతి ఫోన్ కలవకపోవడంతో కుటుంబసభ్యులు బీబీపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఉన్నతాధికారులకు విషయం తెలిసి సెల్‌ఫోన్ టవర్ లోకేషన్ ఆధారంగా వెరిఫై చేయగా, లోకేషన్ అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు ఏరియాలో చూపెట్టింది.
అక్కడికి సిబ్బంది వెళ్లి చూడగా చెరువు ఒడ్డున సెల్ఫోన్దొరికింది. సమీపంలోనే ఎస్సై సాయికుమార్కారు ఉంది. అందులో శృతి బ్యాగు ఉన్నట్టు సమాచారం. ఎస్సై సెల్ఫోన్అతని ప్యాంట్ జేబులోనే ఉండగా.. మిగతా ఇద్దరి ఫోన్లు చెరువు గట్టున దొరికాయి. కాగా, వీళ్లు ముగ్గురు కారులోనే వచ్చినట్టు అనుమానిస్తున్నారు. అసలు వీళ్లు ముగ్గురు ఎక్కడ కలుసుకున్నారు..? చెరువు వద్దకు ఎందుకు వచ్చారు..? ఏదైనా విషయంలో గొడవ జరిగి ఆత్మహత్య చేసుకున్నారా..? అనేది తేలాల్సి ఉంది.
ఈ కేసు దర్యాప్తులో మృతుల సెల్ ఫోన్లు, పోస్టుమార్టం రిపోర్టులు కీలకం కానున్నాయి. వీళ్లు ఎలా కలిశారు..? అనేది సెల్ ఫోన్ డేటా ద్వారా తెలిసే అవకాశం ఉంది. ముగ్గురి మృతిపై కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నామని.. మరణాలకు కారణాలు ఇంకా తెలియలేదుని ఎస్పీ సింధు శర్మ తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు, ఎంక్వైరీ తర్వాతే ఏం జరిగిందనే దానిపై క్లారిటీ వస్తుందని అన్నారు.