ఆన్ లైన్ బెట్టింగులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు పోలీసులు. మరి ఉన్నతస్థానంలో ఉన్న పోలీసు ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తే.. వారిపై చర్యలు తీసుకోరా..? అంటే ఎందుకు తీసుకోరు..? అని ప్రశ్నిస్తున్నారు మహారాష్ట్ర పోలీసులు. ఆన్ లైన్ బెట్టింగులో నిలిచి రూ.1.5 కోట్లు గెలుచుకున్న ఓ పోలీసు అధికారిపై ఉన్నతాధికారులు వేటు వేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. చట్టం అందరికీ సమానమే అన్న మెసేజ్ ఇచ్చింది ఈ ఘటన.
అసలేం జరిగిందంటే..?
డ్రీమ్ 11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్న ఓ ఎస్‌ఐకి అధికారులు షాక్ ఇచ్చారు. పోలీసు విభాగం ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ సదరు ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు వేశారు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన అధికారి ఆన్‌లైన్ గేమింగ్‌లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేశారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11లో రూ.కోటిన్నర గెలుచుకొని వార్తల్లో నిలిచారు ఎస్.ఐ. సోమనాథ్. అయితే.. తాజాగా పోలీసు ఉన్నతాధికారులు తనపై తీసుకొన్న క్రమశిక్షణ చర్యతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నిబంధనలను అతిక్రమించి పోలీస్‌శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ ఆయనను విధుల నుంచి సస్పెండు చేస్తున్నట్లు ఏసీపీ సతీశ్ మానే చెప్పారు.
Also Read :- సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇస్తాం
మహారాష్ట్రలోని పింప్రీ - ఛించ్వాడ్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేసే సోమనాథ్ అక్టోబరు 10వ తేదీన విధుల్లో ఉండి.. ఇంగ్లాండ్ - బంగ్లాదేశ్ మ్యాచ్‌పై బెట్టింగులో పాల్గొన్నారని తెలిపారు. ఆయనపై తదుపరి విచారణ బాధ్యతలను డీసీపీకి అప్పగించారు. మూడు నెలలుగా సోమనాథ్ డ్రీమ్ 11లో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన ఇంగ్లాండ్ - బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఉత్తమంగా ఆడిన ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసుకున్న ఆయన.. ఫాంటసీ గేమ్‌లో అగ్రస్థానంలో నిలిచి రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ విషయం డిపార్ట్ మెంట్ వరకూ తెలిసింది. దీంతో సోమనాథ్ పై చర్యలు తీసుకున్నారు.
