వచ్చే పదేళ్లు టీమిండియాలో అతడి ప్లేస్ ఫిక్స్

వచ్చే పదేళ్లు టీమిండియాలో అతడి ప్లేస్ ఫిక్స్
మెల్‌‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్ట్‌‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా కమ్‌బ్యాక్ ఇచ్చింది. తొలి టెస్టులో ఎదురైన ఘోర ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. రెండో మ్యాచ్‌‌లో 8 వికెట్ల తేడాతో గెలిచి కంగారూలను చిత్తు చేసింది. అరంగేట్ర ఆటగాళ్లు శుభ్‌‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్ మెన్ ఇన్ బ్లూ విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత్ గెలుపుపై ఆసీస్ వెటరన్ లెఫ్టాండర్ మైకేల్ హస్సీ స్పందించాడు. గిల్‌‌పై ప్రశంసల వర్షం కురిపించిన హస్సీ.. అతడు వచ్చే పదేళ్లు టీమిండియాకు ఆడగలడని కొనియాడాడు. ‘శుభ్‌‌మన్ గిల్ ఓ క్లాసిక్ ప్లేయర్. వచ్చే పదేళ్లు అలవోకగా భారత్‌‌కు అతడు ఆడగలడు. తొలి టెస్టులో గిల్‌‌ను ఓపెనర్‌‌గా దించాల్సింది. షమీ స్థానంలో వచ్చిన సిరాజ్ మంచిగా పెర్ఫార్మ్ చేశాడు. సిరాజ్ బౌలింగ్ చూస్తుంటే చాలా ఏళ్ల నుంచి టెస్ట్ క్రికెట్ ఆడుతున్నట్లే అనిపించింది. రహానె చెప్పినట్లు ఫస్ట్ టెస్ట్‌‌‌లో భారత్ బాగా ఆడింది. కానీ 90 నిమిషాలు సరిగ్గా ఆడనందునే వాళ్లు ఓడిపోయారు. అయితే తిరిగి పుంజుకున్న తీరు అమోఘం’ అని హస్సీ పేర్కొన్నాడు.