Vijay Hazare Trophy: టీ20 తరహాలో దంచికొట్టిన శ్రేయాస్ అయ్యర్.. 50 బంతుల్లోనే సెంచరీ

టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కు ఈ ఏడాది బాగా కల్సి వచ్చింది. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు టైటిల్ అందించాడు. మెగా ఆక్షన్ లో పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఇటీవలే ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ కెప్టెన్ గా జట్టుకు టైటిల్ అందించడంతో పాటు బ్యాటర్ గాను అదరగొట్టాడు. అతని ఫామ్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలోనూ కొనసాగుతుంది. మెరుపు సెంచరీతో అలరించాడు. 
     
భారత దేశవాళీ క్రికెట్ లో జరిగే విజయ్ హజారే ట్రోఫీ శనివారం (డిసెంబర్ 21) నుంచి ప్రారంభమైంది. వన్డే ఫార్మాట్ లో జరిగే ఈ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్ టీ20 తరహాలో శివాలెత్తాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కర్ణాటకపై కేవలం 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ మ్యాచ్ లో మొత్తం 55 బంతుల్లో 114 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయ్యర్ ఇన్నింగ్స్ లో 10 సిక్సులు.. 5 ఫోర్లున్నాయి. అతని ధాటికి ముంబై 50 ఓవర్లలో 382 పరుగుల భారీ స్కోరు చేసింది.

దుబే 36 బంతుల్లో 5 ఫోర్లు.. 5 సిక్సర్లతో 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయ్యర్, దూబే ఏకంగా 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. ఈ మ్యాచ్ లో కర్ణాటక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అంగ్క్రిష్ రఘువంశీని విద్యాధర్ పాటిల్ ఔట్ చేశాడు.  హార్దిక్ తమోర్, ఆయుష్ మ్హత్రే రెండో వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పరిస్థితిని చక్కదిద్దారు. ఆ తర్వాత అయ్యర్, దూబే మెరుపు ఇన్నింగ్స్ తో జట్టుకు భారీ స్కోర్ అందించారు.