ఎంపీడీవో ఆఫీస్​లో అన్నీ ఖాళీలే

వంగూరు, వెలుగు : మండల పరిషత్  కార్యాలయంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో వివిధ పనుల కోసం ఆఫీస్ కు వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీస్ లో సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్  టైపిస్ట్, వాచ్ మన్,  రెండు జీపీలకు సెక్రటరీలు లేరు. సూపరింటెండెంట్  బదిలీ కావడంతో అతని స్థానంలో ఎవరికి పోస్టింగ్​ ఇవ్వలేదు. సీనియర్  అసిస్టెంట్  చంద్రశేఖర్  అనారోగ్యానికి గురైనప్పటికీ కుటుంబసభ్యుల సహకారంతో ఆఫీస్ కు వచ్చి పోతున్నారు.

దీంతో  ఆఫీస్  పనులన్నీ పెండింగ్​లో ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా జూనియర్ టైపిస్ట్​ను చారగొండ మండలానికి డిప్యూటేషన్ పై పంపించారు. ఇక ఆఫీస్ లో వాచ్ మన్ తో పాటు వెలమలపల్లి, వెంకటాపూర్  గ్రామాలకు పంచాయతీ సెక్రటరీలు లీవ్​లో వెళ్లడంతో పనులు పెండింగ్ లో ఉంటున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా ఎంపీడీవో ఆఫీస్​లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.