వనపర్తి సబ్  రిజిస్ట్రార్ ఆఫీసులో.. రెగ్యులర్​ ఆఫీసర్​ లేరు

వనపర్తి,  వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని అందించే వనపర్తి సబ్ రిజిస్ట్రార్  కార్యాలయానికి రెగ్యులర్  ఆఫీసర్​ కరువయ్యారు. వివిధ ఆరోపణలతో ఇక్కడ పని చేసిన సబ్  రిజిస్ట్రార్​ కిష్టఫర్​ను సస్పెన్షన్​ చేయగా, గత నెల 19 నుంచి మహబూబ్​నగర్​ ఆఫీస్​లోని సీనియర్​ అసిస్టెంట్​కు బాధ్యతలు ఇచ్చారు.

సస్పెన్షన్​కు గురైన ఆఫీసర్​ ఇంకా కొన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఒప్పందం చేసుకోవడంతో, పలువురు ఆఫీస్​కు వచ్చి  ఇన్​చార్జి ఆఫీసర్​తో గొడవకు దిగుతున్నారు. దీంతో తనకు ఇన్​చార్జి బాధ్యతలు తప్పించాలని కోరినా జిల్లా అధికారి  అంగీకరించకపోవడంతో ఆయన లాంగ్​ లీవ్​లో వెళ్లిపోయారు. అప్పటి నుంచి రిజిస్ట్రేషన్​ ఆఫీసులోని ఒక జూనియర్ అసిస్టెంట్ కు ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించారు.

భారీగా ఆదాయం..

వనపర్తి సబ్  రిజిస్ట్రార్  ఆఫీసులో ప్రతి రోజు 30 వరకు డాక్యుమెంట్  రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. ప్రస్తుతం డాక్యుమెంట్  రిజిస్ట్రేషన్లతో పాటు 10 దాకా బ్యాంక్  మార్ట్ గేజ్  రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఇదిలాఉంటే గత వారం రోజుల్లో భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.1,091 రిజిస్ట్రేషన్లు కాగా, రూ.35,21,441 ఆదాయం సమకూరింది.

సబ్​ రిజస్ట్రార్​పై కేసు..

ఆఫీస్​లోని కొందరు సిబ్బంది, ఓ డాక్యుమెంట్​ రైటర్ తో కలిసి గత సబ్​ రిజిస్ట్రార్​ కిష్టఫర్​ అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. గోపాలపేట రోడ్డులోని ఒక వెంచర్​లో ఉన్న ఇంటర్నల్​ రోడ్లను వెంచర్  నిర్వాహకులు బై నంబర్లు వేసి విక్రయించగా, వాటికి సబ్  రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ వెంచర్​లో ప్లాట్లు కొన్న వారితో పాటు వెంచర్ లోని భాగస్వాములకు ఈ విషయం తెలియడంతో రిజిస్ట్రేషన్  ఆఫీస్​ వద్ద ఆందోళన చేపట్టారు. కలెక్టర్, రిజిస్ట్రార్, కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రేషన్  కంటే ముందే కొందరు వెంచర్​ నిర్వాహకులు ఈ విషయాన్ని కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లారు.

కలెక్టర్​ రిజిస్ట్రేషన్లను ఆపేయాలని లెటర్​ రాశారు. అయినప్పటికీ రిజిస్ట్రేషన్లు చేశారు. వీటితో పాటు డీటీసీపీ కాని ప్లాట్లను రిజిస్ట్రేషన్  చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇదిలాఉంటే ఇక్కడ పని చేసిన సబ్​ రిజిస్ట్రార్, కొందరు  సిబ్బందితో పాటు డాక్యుమెంట్​ రైటర్, వెంచర్​ ఓనర్స్​తో కలిపి 10 మందిపై గోపాలపేట పోలీస్​స్టేషన్​లో  కేసు నమోదైంది. రెగ్యులర్​ ఆఫీసర్​ లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇండ్ల స్థలాలు, ఇండ్లు, ఇతర స్థిర, చరాస్తుల రిజిస్ట్రేషన్లు​చేసుకోడానికి ఇబ్బంది పడుతున్నారు. వనపర్తిలో రెగ్యులర్​ సబ్​రిజిస్ట్రార్​ను నియమించాలని కోరుతున్నారు.