- తగ్గిన షిప్‌మెంట్లు
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల కొరత వల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీతోపాటు స్మార్ట్ ఫోన్ కంపెనీలూ ఇబ్బందిపడుతున్నాయి. వరసగా నాలుగు క్వార్టర్లలో వీటి అమ్మకాలు బాగా పెరిగినా, సెప్టెంబర్ క్వార్టర్లో మాత్రం స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు 48 మిలియన్ యూనిట్లకు తగ్గాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో 54.2 మిలియన్ యూనిట్లుగా షిప్‌మెంట్లు ఉన్నాయి. అంటే 12శాతం తగ్గుదల కనిపించింది. గత సంవత్సరం మొదటివేవ్ తర్వాత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు ఇబ్బందులు మొదలయ్యాయి. సప్లయ్ చెయిన్లలో సమస్యలు ఏర్పడ్డాయి. చిప్‌ల కొరత కారణంగా ప్రొడక్షన్ తగ్గుతోంది. వచ్చే ఏడాది మొదటి క్వార్టర్లోనూ గ్రోత్ తక్కువగా ఉంటుందని ఐడీసీ అంచనా వేసింది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో ఫోన్ల షిప్‌మెంట్‌ల గ్రోత్ సింగిల్-డిజిట్ కు పరిమితమవుతుందని తెలిపింది.
9 నెలల్లో 12 కోట్ల ఫోన్లు..
"ఈ సంవత్సరంలోని మొదటి తొమ్మిది నెలల్లో (జనవరి – సెప్టెంబర్) కంపెనీలు 12 కోట్ల యూనిట్లను రిటైలర్లకు పంపించాయి. జూన్ వరకు షిప్‌మెంట్లలో42శాతం గ్రోత్ కనిపించింది. సరఫరాలు లేకపోవడం వల్ల ఆ తర్వాతి క్వార్టర్‌లో షిప్‌మెంట్లు తగ్గాయి. ఫలితంగా 2021 సంవత్సరంలో 16 కోట్ల యూనిట్ల కంటే తక్కువ వార్షిక షిప్‌మెంట్లు వస్తాయి" అని ఐడీసీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ నవకేందర్ సింగ్ అన్నారు. 2022 మొదటి 6 నెలల్లోనూ ఫోన్ల సప్లయ్ తక్కువగానే ఉండొచ్చని, చివరి 6 నెలల్లో పరిస్థితి మెరుగుపడుతుందని అంచనావేశారు.
