అమానుషం.. కాలుతున్న టైరు ముక్క విసరడంతో ఏనుగు మృతి

అమానుషం.. కాలుతున్న టైరు ముక్క విసరడంతో ఏనుగు మృతి

తమిళనాడులో అమానుష ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోకి వ‌చ్చిన ఏనుగును త‌రిమిగొట్ట‌డానికి కాలుతున్న టైరు ముక్క‌ను విసిరి వేయ‌డంతో ఆ ఏనుగు మ‌ర‌ణించింది. నీలగిరిలోని మాసినగుడిలో జరిగిందీ సంఘటన. అడ‌వి నుంచి గ్రామంలోకి చొరబ‌డ్డ ఆ వన్య‌ప్రాణిని తరిమికొట్టే ప్రయత్నంలో కొంద‌రు వ్య‌క్తులు ఏనుగుపై కాలే టైరు ముక్క‌ను విసర‌గా.. ఆ టైర్ ఏనుగు చెవిలో చిక్కుకుంది. దాంతో అది బాధతో అక్క‌డి నుంచి పారిపోయింది. కొన్ని రోజుల త‌ర్వాత ఆ ఏనుగు చెవి, వెనుక భాగంలో తీవ్ర‌మైన కాలిన గాయాల‌తో క‌నిపించ‌డంతో ఫారెస్ట్ రేంజర్స్ ఏనుగుకు ఫ‌స్ట్ ఎయిడ్ చేశారు. జనవరి 19 న ట్రీట్‌మెంట్ కోసం మెడిక‌ల్ క్యాంప్ కు త‌ర‌లిస్తున్నప్పుడు దురదృష్టవశాత్తు ఆ మూగ‌జీవి మరణించింది.

ఈ దారుణానికి కార‌ణ‌మైన‌ ముగ్గురు నిందితుల(ప్రసాద్, రేమండ్ డీన్, రికీ రాయన్)ల‌పై కేసు నమోదు చేసినట్లు మాసినగుడి టైగర్ రిజర్వ్ సీనియర్ అధికారి ఒకరు మీడియాతో అన్నారు. వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేశామ‌ని, మ‌రో వ్యక్తిని ఇంకా పట్టుకోలేదని తెలిపారు.