ఆటోలో వేధించి .. ఆపై ఇంటికి వెళ్లి బాలికపై గ్యాంగ్ రేప్​ అటెంప్ట్

  • బాధితురాలిని కత్తులతో భయపెట్టిన నిందితులు
  • బోరబండ పరిధిలో ఘటన
  • నలుగురు నిందితులకు రిమాండ్​ 

జూబ్లీహిల్స్, వెలుగు: కత్తులతో బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారానికి యత్నించిన నలుగురిని బోరబండ పోలీసులు అరెస్ట్ ​చేసి రిమాండ్​కు తరలించారు. సీఐ వీరశేఖర్ ​కథనం ప్రకారం.. బిహార్​కు చెందిన 17 ఏండ్ల బాలిక బోరబండ ఇందిరానగర్​లోని తన బంధువుల ఇంట్లో ఉంటూ మాదాపూర్​లోని ఓ హోటల్​లో పని చేస్తోంది. సోమవారం రాత్రి 11 గంటలకు పనులు ముగించుకుని తన స్నేహితుడితో కలిసి ఆటోలో ఇంటికి వస్తోంది. 

అన్నా నగర్ వరకు రాగా ఆటోలో ఇద్దరే ఉండడం చూసిన బిహార్​కు చెందిన అక్బర్, అంబదాస్, ఫరీద్, మోసిన్​అనే క్యాబ్​ డ్రైవర్లు వారిని అడ్డగించారు. వీరంతా బోరబండ 3 సైట్​లో ఉంటున్నారు. ఇంత రాత్రి ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? అని ఇద్దరిని ప్రశ్నించారు. తర్వాత అందులోని ఒకరు ఆటో ఎక్కి డ్రైవర్​పక్కన కూర్చోగా, మరొకరు బాలిక పక్కన కూర్చున్నాడు. ఆటో వెళ్తుండగా వెనక బైక్​లపై మరో ఇద్దరు వెంబడించారు. ఇదంతా ఏంటని ఆటో డ్రైవర్ ​ప్రశ్నించగా, చంపేస్తామని, ఆటోను అలాగే పోనివ్వాలని బెదిరించారు.

 ప్రైవేట్​ పార్ట్స్​ తాకుతూ..

బాలిక పక్కన కూర్చున్న వ్యక్తి కత్తితో బెదిరిస్తూ ఆమె శరీరాన్ని, ప్రైవేట్​ పార్ట్స్​ను తాకాడు. ఆమె పక్కనే కూర్చున్న స్నేహితుడు అభ్యంతరం వ్యక్తం చేయగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కొద్ది సేపటికి ఆటో డ్రైవర్​ బాలిక ఇంటి సమీపంలో అందరినీ దింపి వెళ్లిపోయాడు. తర్వాత కనీసం పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేదు. బాలిక, ఆమె స్నేహితుడు ఇద్దరూ ఇంటికి వెళ్తుండగా నిందితులు వెంబడించారు.  బైక్​పై వచ్చిన మరో ఇద్దరు నిందితులు బాలిక స్నేహితుడిని పట్టుకుని డబ్బులు ఇస్తేనే వదిలిపెడతామని బెదిరించారు. బాలిక ఇంట్లోకి వెళ్లినా వదిలిపెట్టలేదు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ఆమెతో పాటు బంధువులను చంపేస్తామని కత్తి చూపుతూ లైంగికదాడికి యత్నించారు. 

చుట్టుపక్కల వారు ఉన్నా భయపడకుండా లైంగికంగా వేధిస్తుండడంతో ఒకరు డయల్​100కు కాల్​చేసి చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్లిన బోరబండ పోలీసులు అక్కడి నుంచి తప్పించుకునే యత్నం చేసిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత మరో ఇద్దరిని కూడా పట్టుకున్నారు. బాలిక ఫిర్యాదు మేరకు నిందితులపై బీఎన్ఎస్, పొక్సో యాక్ట్​ల కింద గ్యాంగ్​రేప్​కు యత్నించడం, దారి కాచి కత్తితో బెదిరించడం వంటి కేసులు నమోదు చేసి రిమాండ్​చేసినట్టు తెలిపారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. నిందితుల నుంచి బైక్,  నైఫ్​, సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే అక్కడ ఏం జరిగిందన్న విషయం తెలుసుకోవడానికి ఆటో డ్రైవర్​కోసం గాలిస్తున్నట్టు ఇన్​స్పెక్టర్​ వీర శేఖర్​ చెప్పారు.