వాష్ రూమ్​లోకి వెళ్లి యాసిడ్ తాగింది.. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఘటన

  • ప్రేమ పేరుతో వేధింపులు.. యాసిడ్​ తాగి యువతి సూసైడ్
  • మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఘటన
  • నిందితుడిని కఠినంగా శిక్షించాలని పీఎస్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

జవహర్ నగర్, వెలుగు: ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఏసీపీ మహేశ్​కుమార్ వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని దమ్మాయిగూడ న్యూ భవాని నగర్ కాలనీకి చెందిన పొన్నగంటి తానేశ్, పద్మ దంపతులు. వీరి కూతురు పూర్ణిమ(19) ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండియర్​చదువుతోంది. ఈ నెల 24న కాలేజీకి నుంచి ఇంటికి వచ్చిన పూర్ణిమ పిల్లలకు ట్యూషన్ చెప్తుంది. ఈ క్రమంలోనే వాష్ రూమ్​లోకి వెళ్లి యాసిడ్ తాగింది. ఆ తర్వాత యాసిడ్ తాగినట్లు పిల్లలకు చెప్పడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే స్థానిక ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

నిఖిల్ అనే యువకుడి వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరి ఏ ఆడబిడ్డకు జరగకుండా, నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షపడేలా చేస్తామని ఏసీపీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు.