బెడిసికొట్టిన.. రూ. కోటి డీల్!..ఏసీబీకి దొరికిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ కేసులో విస్తుపోయే నిజాలు 

బెడిసికొట్టిన.. రూ. కోటి డీల్!..ఏసీబీకి దొరికిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ కేసులో విస్తుపోయే నిజాలు 
  • స్కానింగ్ సెంటర్ పై చర్యలు లేకుండా రూ.కోటి డీల్
  • ఓ ఆస్పత్రి నిర్వాహకుడు, రేషన్ దందా చేసే డీలర్ మధ్యవర్తిత్వం 
  • బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో బెడిసికొట్టిన వ్యూహం 
  • మరికొందరు పోలీసుల పాత్రపైనా ఇంటెలిజెన్స్ ఆరా

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడిని రూ.25 లక్షలు లంచం డిమాండ్ చేసి డీఎస్పీ, సీఐ ఏసీబీకి పట్టుబడిన కేసులో విస్తుపోయే నిజాలు తెలిశాయి.  పోలీసులతో సన్నిహితంగా ఉండే రేషన్ దందా చేసే డీలర్, ఓ ఆస్పత్రి నిర్వాహకుడు మధ్యవర్తిత్వం వహించి..  స్కానింగ్ సెంటర్ పై కేసు నమోదు చేయకుండా రూ. కోటి డీల్ మాట్లాడినట్లు తెలిసింది.

అయితే స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు అంత ఇవ్వలేకనే ఏసీబీని ఆశ్రయించడంతో వ్యూహం బెడిసికొట్టింది.  సూర్యాపేట డీఎస్పీ, సీఐ ఏసీబీకి పట్టుబడ్డారు. కాగా.. లంచం డిమాండ్ కేసును సీరియస్ గా తీసుకున్న జిల్లా పోలీస్ శాఖ.. ఇంటలిజెన్స్ టీమ్ తో మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. 

స్కానింగ్ సెంటర్ పై చర్యలు లేకుండా.. 

ఇటీవల సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ టీమ్ తనిఖీల్లో పలు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు ఎలాంటి అర్హతలు, పర్మిషన్లు లేకుండా నిర్వహిస్తున్నట్లు తేలింది. వీటిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి కంప్లయింట్లు వెళ్లాయి. అయితే.. అర్హత లేని స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు  కేసు నుంచి బయటపడేందుకు అడ్డదారిలో వెళ్లాడు.

గతంలో జిల్లాలో అక్రమ రేషన్ దందా చేసిన డీలర్..  జిల్లా కేంద్రంలో ఓ ఆస్పత్రి నిర్వాహకుడు పోలీసులకు సన్నిహితంగా ఉంటుండగా.. వారిని సంప్రదించాడు. తనపై కేసు నమోదు కాకుండా చూడాలని కోరాడు. ఇందుకు రూ. కోటి దాకా ఖర్చు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఇందులో డీఎస్పీ, సీఐతో పాటు మరికొందరు ఆఫీసర్లకు ఇవ్వాల్సి ఉంటుందని అందుకే.. రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.

బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. 

రూ. కోటి డిమాండ్ చేయడంతో సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు చేసేదిలేక ఏసీబీని ఆశ్రయించాడు. ఆదేశాల మేరకు బాధితుడు స్పై కెమెరా పెట్టుకొని ముందుగా సూర్యాపేట సీఐ వీర రాఘవులును కలిశాడు. కేసు నమోదు చేయొద్దని స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు కోరగా.. అందుకు సీఐ రూ.25 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. ఇచ్చే డబ్బులో డీఎస్పీకి కూడా వాటా ఇవ్వాలని చెప్పగా.. చివరకు రూ.16 లక్షలు ఇస్తానని బాధితుడు ఒప్పుకున్నాడు.

ఇరువురు మాట్లాడుకున్నదంతా స్పై కెమెరాలో రికార్డ్ అయింది. అనంతరం ఏసీబీకి చెప్పగా వెళ్లి డీఎస్పీ ఆఫీస్ పై రైడ్ చేశారు. డీఎస్పీ, సీఐని రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు. కాగా.. మరో రెండు ఆస్పత్రుల నుంచి కూడా పోలీసులు రూ. లక్షల్లో లంచాలు తీసుకొని కేసులు లేకుండా చేసినట్టు విచారణలో గుర్తించారు. అయితే.. రూ. కోటి డీల్ మాట్లాడిన ఆస్పత్రి నిర్వాహకుడితో పాటు, రేషన్ దందా డీలర్, మరో ఇద్దరు పోలీసుల పాత్ర ఇందులో ఉన్నట్లు తెలిసింది.

ఆయా పోలీసుల పాత్రపై ఇంటెలిజెన్స్ వివరాలు సేకరిస్తోంది.  గతంలో రేషన్ దందాకు పాల్పడుతున్న నలుగురిని ఓ పోలీస్ అధికారి అరెస్ట్ చేయగా..  ఎలాంటి కేసులు, చర్యలు తీసుకోకపోవడంతో అతనిపైనా ఆరా తీస్తోంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా మరికొందరిపై చర్యలు తీసుకునే చాన్స్ ఉన్నట్లు ఒక పోలీస్ అధికారి తెలిపారు.