ముర్ముకు మద్దుతు పలికిన అఖిలేష్ బాబాయ్‌

ముర్ముకు మద్దుతు పలికిన అఖిలేష్ బాబాయ్‌

త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే బలపరిచిన ద్రౌపది ముర్ముకు అఖిలేష్ యాదవ్‌ బాబాయ్‌ శివపాల్‌ సింగ్‌ యాదవ్‌ మద్దుతు తెలిపారు. ‘‘రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు ఓటేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నన్ను కోరారు. కావున ఎన్డీయే అభ్యర్థికి ఓటేయాలని నిర్ణయించుకున్నాను’’ అని శివపాల్‌ తెలిపారు. యోగి శుక్రవారం రాత్రి విందు ఇచ్చిన నేపథ్యంలో శనివారం శివపాల్‌ ఈ ప్రకటన చేశారు.  విపక్షాల  అభ్యర్థికి ఓటేయమని అఖిలేష్ తనని కోరలేదని శివపాల్‌  అన్నారు.  పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదని, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాతో సమావేశానికి కూడా తనని పిల‌వ‌లేదని తెలిపారు. 

అఖిలేష్  కు రాజకీయ పరిపక్వత లేకపోవడం వల్ల  సమాజ్‌వాదీ పార్టీ బలహీనపడుతోందని, కూటమిలోని అనేక పార్టీలు ఇప్పుడు విడిపోతున్నాయని అన్నారు.  అఖిలేష్  ఒకవేళ  తన సలహాలు తీసుకొని  ఉంటే ప్రస్తుతం యూపీలో సమాజ్‌వాదీ పార్టీ పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు.  కాగా నిన్న శుక్రవారం యోగి ఆదిత్యనాథ్‌ ఏర్పాటు చేసిన విందుకు శివపాల్‌ యాదవ్‌ తో పాటుగా సుహేల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ కూడా హాజరయ్యారు. 

శివపాల్‌ సింగ్‌ యాదవ్‌...  అఖిలేష్‌ యాదవ్‌ కు  సొంత బాబాయ్‌ అవుతారు. అఖిలేష్‌ యాదవ్‌ సీఎంగా ఉన్నప్పుడు ఎస్పీలో కీలకనేతగా ఉన్నారు.  2018లో అఖిలేష్‌తో విభేదాలు రావడంతో పార్టీ నుంచి బయటకు వచ్చేసి ప్రగతిశీల సమాజ్ వాదీ అనే పేరుతో పార్టీ పెట్టారు. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు మళ్లీ  అబ్బాయితో కలిసి చేతులు కలిపారు. ఆ ఎన్నికల్లో ఎస్పీ తరుపునే పోటీ చేసిన ఆయన జస్వంత్‌నగర్ నుంచి  ఎమ్మెల్యేగా  గెలిచారు. ఎన్నికల ఫలితాల తరువాత బాబాయి, అబ్బాయి మధ్య మళ్లీ గ్యాప్ వచ్చిందని వార్తలు రాగా, ఇప్పుడది బహిర్గతం అయ్యింది.