మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. రెబల్ ఎమ్మెల్యేలు లక్ష్యంగా శివసేన వడివడిగా పావులు కదుపుతోంది. ఏక్ నాథ్ షిండే సహా మొత్తం 16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత అస్త్రాన్ని సంధించింది. వారిపై అనర్హత వేటు వేయాలంటూ శుక్రవారం మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కార్యాలయంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈనెల 22న తాము నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశానికి వారంతా గైర్హాజరయ్యారని శివసేన తెలిపింది. దానికి హాజరుకాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వారికి ముందే చెప్పామని కూడా పిటిషన్ లో పేర్కొంది. ఇక ఇవాళ ఉదయం కూడా మరో నలుగురు శివసేన ఎమ్మెల్యేలు గుజరాత్ లోని సూరత్ కు వెళ్లినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. వారిలో ముగ్గురు అక్కడి నుంచి అస్సాంలోని గౌహతిలో ఏర్పాటైన రెబల్ ఎమ్మెల్యేల క్యాంపునకు వెళ్తారని వార్తలు వస్తున్నాయి.
నాతో ఉన్నదే నిజమైన శివసేన..
మరోవైపు ‘నాకు మొత్తం 50 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. వారిలో 40 మంది శివసేన ఎమ్మెల్యేలే. నాపై నమ్మకం ఉన్న వారంతా వచ్చి గౌహతిలోని రెబల్ క్యాంపులో చేరొచ్చు. నాతో ఉన్నదే నిజమైన శివసేన’ అని ఏక్ నాథ్ షిండే చెబుతున్నారు. సీఎం ఉద్ధవ్ థాక్రేతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని అంటున్నారు. ఈమేరకు ఆయన మహారాష్ట్ర గవర్నర్, డిప్యూటీ స్పీకర్ లకు లేఖలు రాశారు. ఒకవేళ శివసేన కోరుతున్నట్లుగా 16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే.. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సానుకూల పరిణామంగా పరిగణిస్తుందని పరిశీలకులు అంటున్నారు. మరోవైపు శివసేన శాసనసభా పక్ష నేతగా అజయ్ చౌదరి, చీఫ్ విప్ గా సునీల్ ప్రభును నియమించడాన్ని కీలక పరిణామంగా పరిగణించాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీంతో శివసేన శాసనసభా పక్ష నేతగా ఏక్ నాథ్ షిండేను, పార్టీ చీఫ్ విప్ గా భరత్ గోగావాలేను ఎంపిక చేయాలని రెబల్స్ చేసిన రెండు ప్రతిపాదనలకు మొండిచెయ్యే మిగిలినట్లయిందని గుర్తు చేస్తున్నారు.
ఆ 16 మంది రెబల్ఎమ్మెల్యేలు వీరే..
ఏక్‌నాథ్ షిండే, మహేష్ షిండే, అబ్దుల్ సత్తార్, భరత్ గోగావాలే, సంజయ్ శిర్సత్, యామిని జాదవ్, అనిల్ బాబర్, తానాజీ సావంత్, లాతా సోన్‌వానే, ప్రకాశ్ సుర్వే, బాలాజీ కినికార్, సందీపన్ భూమ్రే, బాలాజీ కళ్యాంకర్, రమేశ్ బొర్నారే, చిమన్‌రావ్ పాటిల్, సంజయ్ రైముంకార్
