మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో తెలియడం లేదు. శివసేనకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే కు మద్దతును తెలియచేస్తున్నారు. ఆయన వైపు చేరుతున్న శాసనసభ్యుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈనేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే కైలాస్ పాటిల్.. ఠాణేలోని రెబల్ క్యాంపు నుంచి పారిపోయి వచ్చానంటూ చేసిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశమైంది. కేవలం ఒత్తిడి కారణంగానే కొందరు సంతకాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఉద్ధవ్ థాక్రే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తాము ఆయన వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఎలా తప్పించుకున్నానో ఆయన ఓ జాతీయ మీడియా సంస్థకు వివరించారు. ‘‘జూన్ 20న ఠాణేలోని ఓ హోటల్ లో డిన్నర్ కు ఏక్ నాథ్ షిండే ఆహ్వానించడంతో నేను అక్కడకు వెళ్లాను. డిన్నర్ ముగిసిన తర్వాత కార్లలో ఎమ్మెల్యేలను తరలిస్తున్నారనే విషయం నాకు తెలిసింది. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని.. దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర నడుచుకుంటూ పారిపోయి వచ్చాను. మార్గం మధ్యలో ఓ ద్వి చక్రవాహనదారుడి సహాయంతో సీఎం నివాసానికి చేరుకున్నాను’’ అని ఎమ్మెల్యే కైలాస్ పాటిల్ చెప్పుకొచ్చారు.
