Shilpa Shetty:రోబోటిక్ ఏనుగుని గిఫ్ట్ గా ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్ప శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా బాలెహోన్నూరులోని రంభపురి మఠానికి ఏనుగుని బహుమతిగా ఇచ్చారు. అయితే ఇది నిజమైన ఏనుగు కాదు. అధునాతన టెక్నాలజీతో నిర్మించిన రోబోటిక్ ఏనుగు. ఈ రోబోటిక్ ఏనుగు చూడటానికి అచ్చం నిజమైన ఏనుగులాగా ఉంటుంది. 

తొండం, చెవులు, తోక, దంతాలు ఇలా అన్నీ కూడా నిజ ఏనుగు మాదిరిగానే ఉంటాయి. ఈ ఏనుగుకి రంభపురి మఠం పీఠాధిపతి వీర సోమేశ్వర స్వామిజీ స్వాగతం పలికారు. ఐతే ఈ రోబోటిక్ ఏనుగు మఠం ప్రాంగణంలో ఉండి భక్తులను ఆశీర్వదిస్తూ భక్తులను ఆకట్టుకుంటోంది. దీంతో భక్తులు ఈ ఏనుగుని చూడటానికి ఆసక్తిగా వస్తున్నారు. అయితే ఈ రోబోటిక్ ఏనుగుని తయారు చేయడానికి దాదాపుగా రూ .10 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.

నటి శిల్ప శెట్టి స్వతహాగా కర్ణాటక రాష్ట్రానికి చెందినప్పటికీ వృత్తి, సినిమా అవకాశాల రీత్యా ముంబైలో సెటిల్ అయ్యింది. ఈ క్రమంలో శిల్ప శెట్టి మొదటగా నిజమైన ఏనుగుని రంభపురి మఠానికి బహుకరించాలని అనుకుంది. కానీ చట్టపరమైన అనుమతులు, వన్య ప్రాణుల సంరక్షణ వంటివాటి కారణంగా ఇది కుదర్లేదు. దీంతో అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన రొబోటిక్ ఏనుగుని బహుమతిగా ఇచ్చారు.

ఈ విషయం ఇలా ఉండగా నటి శిల్ప శెట్టి ప్రస్తుతం తన భర్త రాజ్ కుంద్రా తో కలసి ముంబై లో ఉంటోంది. ఈ క్రమంలో మనీలాండరింగ్, అడల్ట్ కంటెంట్ వీడియోల డిస్ట్రిబ్యూటింగ్ వంటివాటిపై ఆరోణనలు ఎదుర్కొంటూ పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా గతంలో అరెస్ట్ అయి బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు.