- వీవోఏను అరెస్ట్ చేయాలని సీఐకి వినతిపత్రం ఇచ్చిన బాధితులు.
రామయంపేట, నిజాంపేట, వెలుగు: నిజాంపేట మండల పరిధిలోని నందిగామలో వీవోఏ ప్రవీణ సెల్ఫ్హెల్ప్గ్రూప్(ఎస్ హెచ్ జీ)లకు సంబంధించి రూ.1.15 కోట్ల స్కామ్లో గ్రామానికి చెందిన 10 ఎస్ హెచ్ జీ గ్రూప్ లీడర్లకు రామయంపేట డీసీసీబీ బ్యాంక్ ఆఫీసర్లు నోటీసులు జారీ జేశారు. ఈ క్రమంలో గ్రూప్ లీడర్లు సోమవారం రామయంపేట సీఐ వెంకటరాజా గౌడ్ ను కలిసి వీవోఏ చేసిన అక్రమాన్ని వివరించారు. పరారీలో ఉన్న ప్రవీణను అరెస్ట్ చేసి స్వాహా చేసిన డబ్బులు అమెతోనే బ్యాంక్ లో డిపాజిట్ చేయించాలని కోరారు.
ఈ సందర్భంగా గ్రూప్ లీడర్స్ మీడియాతో మాట్లాడుతూ 10 గ్రూప్ లకు సంబంధించి ప్రతి నెలా కిస్తీ డబ్బులు వీవోఏ ప్రవీణకు ఇవ్వగా ఆమె డబ్బులు బ్యాంక్ లో కట్టకుండా సొంతానికి వాడుకుందని ఆరోపించారు. ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్లు తమకు నోటీసులు అందించి, బకాయిలు కట్టకుంటే ఇళ్లకు తాళాలు వేస్తామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తీసుకున్న అప్పు మొత్తం తీరే వరకు రెగ్యులర్గా కిస్తీలు కట్టామని గ్రూప్ లీడర్లు తెలిపారు. వీవోఏ చేసిన మోసానికి తమను బాధ్యులు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. పోలీసులు ఈ విషయంలో తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.