గొర్రెల కాపరిపై ఎలుగుబంటి దాడి

అమ్రాబాద్, వెలుగు: ఎలుగుబంటి దాడిలో గొర్ల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి.  నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిళ్ల గ్రామ సమీపంలోని కాళ్లమర్రి అడవిలో, నల్గొండ జిల్లా కాసరాజు పల్లికి చెందిన అంజయ్య అలియాస్ ముసలయ్య (55)  గొర్లు మేపుతున్నాడు.  శనివారం ఉదయం అతనిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.  

గాయాలతో బయటపడి గ్రామ శివారులోకి చేరుకోగా గ్రామస్తులు 108 కు సమాచారం అందించారు. 108 సిబ్బంది మల్లేశ్, రమేశ్ ప్రాథమిక చికిత్స అందించి అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ డివిజనల్ అధికారి రామ్మూర్తి క్షతగాత్రుడిని పరిశీలించారు.  తీవ్ర రక్తస్రావంతో పాటు తల, కండ్లకు గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు ఎఫ్డీఓ రామ్మూర్తి తెలిపారు.