జగన్‌‌‌‌ బెయిల్ రద్దుకు షర్మిల కుట్ర

  • చంద్రబాబుతో లాలూచీ పడ్డారు: ఎంపీ విజయసాయి రెడ్డి

పంజాగుట్ట/హైదరాబాద్, వెలుగు: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్​రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయించేందుకు సీఎం చంద్రబాబుతో కలిసి ఏపీసీసీ చీఫ్‌‌‌‌ షర్మిల కుట్ర పన్నారని వైఎస్సార్‌‌‌‌‌‌‌‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఆరోపించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కాకుండా ఉండేందుకు చంద్రబాబుతో షర్మిల లాలూచీ పడ్డారన్నారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయనోడు ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని షర్మిల అన్నారని, అయితే కోటి మందికి పైగా అక్కాచెల్లల్లను ఆదుకున్నోడు మీకు న్యాయం చేయడా అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అరుదుగా ఉంటారని చెప్పారు. ‘‘షర్మిలకు పెండ్లయిన 20 ఏండ్ల తర్వాత జగన్‌‌‌‌ మోహన్‌‌‌‌ రెడ్డి ఆమెకు రూ.200 కోట్లు ఇచ్చారు. ఇలా ఎవరైనా ఇస్తారా... తండ్రి వైఎస్ ఉన్నప్పుడే మీకు ఆస్తులు రాసిచ్చారు. జగన్ మోహన్ రెడ్డి వ్యాపారం ద్వారా సంపాదించిన సొమ్ములో వాటా అడగడం న్యాయమా’’అని ప్రశ్నించారు. రాజశేఖర రెడ్డి, అన్న జగన్ మోహన్ రెడ్డికి శత్రువు అయిన చంద్రబాబుతో కలిసి ఎలా కుట్ర చేస్తారని ఆయన ప్రశ్నించారు. శత్రువుతో కలిసి షర్మిల పాములా విషం చిమ్ముతోందని మండిపడ్డారు. 

మీరు చదివింది జగన్‌‌‌‌ స్క్రిప్ట్​: షర్మిల

వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో చదివింది జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అని, అలా కాదని ఆయన ప్రమాణం చేయగలరా అని షర్మిల ప్రశ్నించారు. ఏపీలోని విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘మీరు కూడా జగన్ మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగిన వాళ్లే కదా. రాజకీయంగా, ఆర్థికంగా జగన్ వల్ల బలపడిన వాళ్లే. మీరు ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే”అని మండిపడ్డారు. వైఎస్సార్‌‌‌‌‌‌‌‌ మరణానికి చంద్రబాబు కారణమని అంటున్నారని, గత ఐదేండ్లు అధికారంలో ఉండి ఈ అంశంపై ఎందుకు విచారణ జరపలేదని, దోషులను ఎందుకు శిక్షించలేదని ప్రశ్నించారు. కేసుల నుంచి బయటపడటానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కుట్ర చేశారని, అధికారంలోకి రాగానే అయనకు అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారని గుర్తుచేశారు. చంద్రబాబు మెప్పు కోసం మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని షర్మిల స్పష్టం చేశారు.