వైసీపీ, టీడీపీ బీజేపీ బానిసలు - షర్మిల ఫైర్..!

అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీల మీద ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శలు చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలతో ఇండియా కూటమి పొత్తును అధికారికంగా ప్రకటించిన సందర్భంలో ఈ వ్యాఖలు చేశారు. వైటెస్సార్సీపి, టీడీపీలు బీజేపీ బానిసలుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్, చంద్రబాబు ఇద్దరు విఫలమయ్యారని ఆరోపించారు. బీజేపీకి తొత్తులుగా మారి ఆంధ్రప్రదేశ్ హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు.

2014లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే పదేళ్ళపాటు ప్రత్యేక హోదా అమల్లోకి వచ్చేదని అన్నారు. మోడీ తిరుపతి సాక్షిగా ఇచ్చిన మాట మార్చారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో కలిసికట్టుగా పోరాడకుంటే పర్వతాల్లాంటి వైసీపీ, బీజేపీలను ఢీ కొట్టలేమని అన్నారు. అందుకే కమ్యూనిస్టులతో వెళ్లాలని నిర్ణయించామని, త్వరలోనే పొత్తుల గురించిన అన్ని అంశాలు ప్రకటిస్తామని తెలిపారు.

ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ నాయకులు శ్రీనివాసరావు, రామకృష్ణ మాటాడుతూ బీజేపీ మతతత్వ పార్టీ అని, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. బీజేపీ, వైసీపీ, టీడీపీల పైనే తమ పోరాటమని, ఈ కూటములు రాష్ట్రాన్ని ఘోరంగా మోసం చేశాయని అన్నారు. జగన్ ఐదేళ్ళలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసాడని, ప్రజలను బిచ్చగాళ్లగా మార్చాడని ఆరోపించారు. మెగా డీఎస్సిని డిమాండ్ చేస్తూ నిరసనకి దిగిన షర్మిలను అరెస్ట్ చేయటం అన్యాయం అని అన్నారు