ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కడప జిల్లాలో వివేకానంద రెడ్డి హత్య రాజకీయ దుమారం రేపుతోంది. వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని ఓడించటం, జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా బరిలో దిగిన షర్మిల ఇద్దరిపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న షర్మిల మరోసారి జగన్, అవినాష్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జిల్లాలో నాలుగు రోజులు ప్రచారం చేయగానే జగన్ అవినాష్ ను మార్చాలని భావిస్తున్నాడని, దీన్ని బట్టి చూస్తే అవినాష్ ఓడిపోబోతున్నాడని జగన్ ఇప్పటికే అర్థమయ్యిందని అన్నారు.
అవినాష్ రెడ్డి హంతకుడని జగన్ కూడా నమ్ముతున్నట్లే కదా అని అన్నారు షర్మిల. అవినాష్ దోషి అని జగన్ విశ్వసిస్తున్నాడని, ప్రజలు కూడా షర్మిల వైపే ఉన్నారని జగన్ ఒప్పుకున్నట్లే అని అన్నారు. దొంగ ఎవరు అంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని అన్నారు. అవినాష్ ని ఉంచినా, మార్చినా జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.ఐదేళ్లుగా హంతకులను ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని అన్నారు షర్మిల.