CPL 2024: 124 మీటర్ల సిక్సర్.. స్టేడియం పై కప్పుకు తగిలిన బంతి

టీ20 క్రికెట్ అంటే సిక్సర్లు కొట్టడం చాలా సహజం. అయితే కొన్ని భారీ సిక్సర్లు మాత్రం అభిమానులను థ్రిల్ కు గురి చేస్తాయి. 100 మీటర్లు సిక్సర్ అంటే ఔరా అంటూ ఆశ్చర్యానికి గురవుతారు. ఇదిలా ఉంటే కరీబియన్ ప్రీమియర్ లో ఒక సిక్సర్ ఏకంగా 124 మీటర్లు దూరంలో పడింది. గయానా అమెజాన్ వారియర్స్ పై ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ఓపెనర్ షాకెరె ప్యారిస్ ఈ ఘనతను సాధించాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మోటీ వేసిన బంతిని ప్యారీస్ లాంగన్ దిశగా స్లాగ్ స్వీప్ ఆడాడు. 

బలంగా కొట్టిన ఈ బంతి 124 మీటర్లు దూరంలో పడడంతో ఒక్కసారిగా మైదానంలో ప్లేయర్లతో పాటు స్టేడియంలో ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఈ మధ్య కాలంలో క్రికెట్ లో ఇదే భారీ సిక్సర్ కావడం విశేషం. ఈ బంతి ఏకంగా స్టేడియం పై కప్పుకు తగిలింది. ప్యారీస్ కొట్టిన ఈ సిక్సర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారీ సిక్సర్ తో అలరించిన ఈ విండీస్ కుర్రాడు 29 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇతని ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు.. 2 సిక్సర్లు ఉన్నాయి. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. షెపర్డ్ 24 బంతుల్లోనే 51 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. రస్సెల్ (36), టిమ్ డేవిడ్ (31) చివర్లో వేగంగా ఆడి మ్యాచ్ ను గెలిపించారు.