శంకర్​పల్లి మోకిలాలో నీట మునిగిన విల్లాలు

  • హైదరాబాద్​ శివారు మోకిలాలోని పలోమా విల్లా వాసుల అవస్థలు
  • నిలిచిన కరెంట్, నీటి సరఫరా
  • 33 ఎకరాల్లో 212 విల్లాలు.. వెయ్యి మంది నివాసం
  • ఒక్కో విల్లా ఖరీదు రూ.5 కోట్ల నుంచి 7 కోట్లు 
  • సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే యాదయ్యకు వినతి

చేవెళ్ల, వెలుగు: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్​పల్లి మోకిలాలోని లా పలోమా గేటెడ్​ కమ్యూనిటీలోని విల్లాలు నీట మునిగాయి. ఇక్కడ మొత్తం 33 ఎకరాల్లో 212 విల్లాలు ఉండగా.. మెయ్యి మంది నివసిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలోని రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కార్లు, బైక్​లు, సైకిళ్లు వరద నీటిలో తేలాయి. ఇక్కడి వాళ్లంతా ఒక్కో విల్లాను రూ.5 నుంచి 7 కోట్లు పెట్టి కొన్నారు. వర్షం పడిన ప్రతిసారి వరద బాధ తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శని, ఆదివారాల్లో గంటల తరబడి కరెంట్ లేదని, మంచినీళ్లకు తిప్పలు పడ్డామని, పాలు కూడా రాలేవని తెలిపారు.

Also Read:-ఉత్తర తెలంగాణకు రెండ్రోజులు ఎల్లో అలర్ట్

ఇండ్లల్లోకి పాములు, తేళ్లు వస్తున్నాయని చెప్పారు. విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య లా పలోమా గేటెడ్​కమ్యూనిటీని సందర్శించారు. వేరే విల్లా బిల్డర్లు.. చుట్టుపక్కల ఉన్న చెరువుల నుంచి వచ్చే నీటిని ప్రహరీ గోడ కట్టి దారి మళ్లించడంతోనే తమకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ పంచాయతీ కూడా సహకరించడం లేదని వాపోయారు. ఎమ్మెల్యే ఆదేశాలతో జీపీ సిబ్బంది స్పందించారు. నీటిని బయటికి పంపేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. హైడ్రాను రూరల్ జిల్లాలకు కూడా విస్తరింపజేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. విల్లాలకు పర్మిషన్ ఇచ్చే ముందు నిబంధనలు పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్ ఆఫీసర్ల కారణంగానే సమస్యలు వస్తున్నాయని అన్నారు.

తీవ్ర ఇబ్బందులు పడ్తున్నం

36 గంటలుగా ఇంటికే పరిమితమయ్యాం. కరెంట్ కూడా లేదు. ఎవరైనా హెచ్ఎండీఏ, రెరా అప్రూవల్ ఉందా.. లేదా.. అని చూసి కొంటారు. అన్నీ చూశాక కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇక అధికారులే చెప్పాలి ఏ పర్మిషన్ చూసి ఇండ్లు కొనాలో.. మా సమస్యను పరిష్కరించాలి.

రాజా చంద్ర ,అసోయేషన్​ అధ్యక్షులు 

గవర్నమెంటే హెల్ప్ చేయాలి

మూడు రోజుల నుంచి కరెంట్ లేదు. జనరేటర్ ఆన్ చేసుకుందామంటే వరద నీటితో కరెంట్ షాక్ వస్తుందేమో అన్న భయం. కరెంట్​లేక రెండు రోజులుగా మినరల్ వాటర్ లేవు. పాల వాళ్లు రావడం లేదు. కోట్లు పెట్టి విల్లా కొన్నం.. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. గవర్నమెంటే సాయం చేయాలి. 

రష్మీ, విల్లా యజమానురాలు