Pakistan Cricket: మా బాబర్ అత్యుత్తమ బ్యాటర్.. ఫామ్‌ కష్టం కాదు: పాకిస్థాన్ కెప్టెన్

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజాం ఫామ్ కోల్పోయి పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న విషయం విదితమే. సుమారు ఏడాదిన్నర కాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న బాబర్.. జట్టుకు భారంగా మారాడు. దాంతో, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అతన్ని తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. టెస్ట్ జట్టు నుంచి తప్పించడమే కాకుండా.. కెప్టెన్సీ సైతం ఊడగొట్టింది. అతని స్థానంలో వికెట్‌ కీపర్‌/ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌కు బాధ్యతలు అప్పజెప్పింది. త్వరలోనే రిజ్వాన్‌ నాయకత్వంలో పాక్‌.. ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనలకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో పీసీబీ టెస్ట్ సారథి షాన్ మసూద్ బాబర్ ఆజాం ఫామ్‌‌పై స్పందించాడు.

 ప్రస్తుతం బాబర్ ఆజాం ఫామ్‌లేమితో సతమతమవుతున్నప్పటికీ, అతను ప్రపంచంలోని అత్యుత్తమ అత్యుత్తమబ్యాటర్లలో ఒకడని షాన్ మసూద్ కొనియాడాడు. మాజీ సారథి త్వరలోనే తిరిగి పుంజుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. టెస్ట్ జట్టుకు దూరమై, అతను గడిపిన విరామ సమయం బాబర్‌కు కలిసొస్తుందని చెప్పుకొచ్చాడు.

అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు..

"అతను(బాబర్ ఆజాం) ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో ఒకడు. అతనికి భవిష్యత్తు లేదని చెప్పడానికి ఎవరూ లేరు.. రారు. ఏదో కొన్ని మ్యాచ్‌ల్లో పరుగులు చేయనంత మాత్రాన కెరీర్ ముగిసిందనడం అవివేకం. అతని గణాంకాలే అతని ప్రదర్శనకు నిదర్శనం. ప్రతి ఆటగాడి జీవితంలోనూ ఇలాంటి రోజులు వస్తుంటాయి. ఆ సమయంలో విరామం అవసరం. తాను ఎల్లప్పుడూ పాకిస్తాన్ తరపున ఆడే ప్రధాన బ్యాటర్లలో ఒకడు.." అని మసూద్ వెల్లడించాడు.

బాబర్ చివరిసారిగా 2023, మే లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సెంచరీ సాధించాడు. అప్పటినుంచి వరుసగా విఫలమవుతున్నాడు. రాబోవు ఆస్ట్రేలియా పర్యటనలోనైనా బాబర్ బ్యాట్ ఝుళిపించకపోతే, జట్టులో చోటు కష్టమే. 

ఆస్ట్రేలియా vs పాకిస్తాన్ షెడ్యూల్:

  • తొలి వన్డే (నవంబర్ 04): మెల్బోర్న్
  • రెండో వన్డే (నవంబర్ 08): అడిలైడ్
  • మూడో వన్డే (నవంబర్ 10): పెర్త్
  • తొలి టీ20 (డిసెంబర్ 14): బ్రిస్బేన్
  • రెండో టీ20 (డిసెంబర్ 16): సిడ్నీ
  • మూడో టీ20 (డిసెంబర్ 18): హోబర్ట్