భక్తిశ్రద్ధలతో షా అలీ పహిల్వాన్ ఉర్సు

అలంపూర్, వెలుగు: పట్టణంలో షా అలీ పహిల్వాన్  ఉర్సును శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉర్సు ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు దడ్ ముబారక్  దర్గా వద్ద మత పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం పెద్ద కిస్తీలో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలంపూర్  పట్టణం సందడిగా మారింది. ఇండ్లల్లో తయారు చేసిన పలావ్, మిఠాయిలు రాతి పాత్రలో వేస్తారు. 

ప్రసాదాన్ని అందుకోవడానికి భక్తులు పోటీ పడతారు. దొరికిన ప్రసాదాన్ని మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. ఉర్సును తిలకించేందుకు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా కర్నాటక, ఏపీ నుంచి భక్తులు తరలివచ్చారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పెద్ద కిస్తీ వేడుకలో పాల్గొన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.